కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎంలు!

18 Oct, 2018 03:02 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో వారి మధ్య ఎప్పుడూ ఆధిపత్యపోరే

బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారని, కానీ వారిలో వారే పోట్లాడుకుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. మోదీ బుధవారం 5 లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇప్పటికే నీరసించిన కాంగ్రెస్‌.. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ పనితీరు వల్ల బీజేపీకి ఏమాత్రం పోటీనిచ్చే స్థితిలో లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల మధ్యప్రదేశ్‌లో లేవనెత్తడానికి కాంగ్రెస్‌కు ఎలాంటి సమస్యలు కనిపించడం లేదని, అందుకే నిస్సహాయ స్థితిలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ ఫొటోలను చూపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కొత్తగా ఓటేయబోతున్న బాలికల్లో 90 శాతం మంది బీజేపీకే మద్దతిస్తున్నట్లు తాను ఓ టీవీ కార్యక్రమంలో చూశానని అన్నారు.

వాటిని వినోదంగానే చూడండి..
మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌సింగ్‌లను మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. కానీ వారిలో ఒకరంటే ఒకరికి పడదు. మరో డజను మంది కూడా సీఎం పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. వారెవరూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరు’ అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న తప్పుడు సమాచారానికి ఎలా స్పందించాలని ఓ కార్యకర్త ప్రశ్నించగా..అలాంటి వార్తలను వినోదంగానే భావించాలని సూచించారు.

సీతారాముల వివాహ ఊరేగింపునకు మోదీ
డిసెంబర్‌ 12న అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్‌ వరకు జరిగే సీతారాముల ప్రతీకాత్మక వివాహ ఊరేగింపు కార్యక్రమానికి  మోదీని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఆహ్వానించనున్నారు. మోదీకి త్వరలో∙ ఆహ్వానం వస్తుందని మీడియాలో వార్తలొచ్చాయి. బరాత్‌ను రాముని జన్మస్థలం అయోధ్య నుంచి  సీతాదేవి పుట్టినిల్లు జనక్‌పూర్‌కు మోదీ తీసుకురానున్నారు. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’కు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా  21న ఎర్రకోటలో  జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు