రంగంలోకి దిగండి!

3 Oct, 2018 09:05 IST|Sakshi

కాంగ్రెస్‌ సీనియర్లందరికీ హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌

ముఖేష్, సుధీర్, సబిత,మర్రి, విష్ణులకు ఓకే

మిగిలిన స్థానాల్లో ఎంపిక బాధ్యత ఎన్నికల కమిటీకి

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ప్రచారం, ప్రత్యర్థులను ఎదుర్కొనే వ్యూహాలకు పదును పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్‌ సీనియర్‌ అభ్యర్థులను ఆదేశించింది. కాంగ్రెస్‌తో ఇతర పార్టీల సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రానప్పటికీ  అంతర్గత సర్వేల్లో పార్టీ బలంగా ఉన్న స్థానాలతో పాటు బలమైన అభ్యర్థులున్న చోట ‘మీరే అభ్యర్థులు..ముందుకు సాగండి’ అంటూ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో గోషామహల్‌–మూల ముఖేష్‌గౌడ్,  ఎల్బీనగర్‌ –దేవిరెడ్డిసుధీర్‌రెడ్డి, మహేశ్వరం– సబితా ఇంద్రారెడ్డి, సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌ – పబ్బతిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలు ఉన్నట్లు సమాచారం. ప్రచారం స్పీడ్‌ పెంచండంటూ వీరికి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది.

ఇక మిగిలిన స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం బహుముఖ పోటీ ఉండటం, కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా ఇతర పార్టీలు కోరుతుండటంతో అభ్యర్థుల ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఫ్లాష్‌ సర్వేలు చేస్తుండటంతో ఆశావహులంతా తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే పీసీసీ నుండి ఏఐసీసీకి వెళ్లే అభ్యర్థుల పేర్ల జాబితా ప్రకారం...సికింద్రాబాద్‌ – పల్లె లక్ష్మణరావుగౌడ్, బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోష్, మేరీ రవీంద్రనాథ్, ముషీరాబాద్‌ –ఎం.అనిల్‌కుమార్, నగేష్‌ ముదిరాజ్, పి.వినయ్‌కుమార్, అంబర్‌పేటలో –మోత రోహిత్, నూతి శ్రీకాంత్, శ్రీకాంత్‌గౌడ్‌లు, ఖైరతాబాద్‌ – ఎంఆర్‌జి వినోద్‌రెడ్డి, అబిద్‌ రసూల్‌ఖాన్, రోహిన్‌కుమార్, మధుకర్‌యాదవ్, నాంపల్లి – ఫిరోజ్‌ఖాన్, పి.రాజేందర్‌యాదవ్, ఉప్పల్‌లో – రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, ఎస్‌కే బడేసాబ్, సోమశేఖరరెడ్డి, రాజేంద్రనగర్‌లో పి.కార్తీక్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, వేణుగౌడ్, కంటోన్మెంట్‌– మన్నె కృశాంక్, మానవతారాయ్, శ్రీగణేష్, బర్రె యాదగిరి, మల్కాజిగిరి–ఆకుల రాజేందర్, నందికంటి శ్రీధర్, ఆదం విజయ్‌కుమార్, మేడ్చల్‌ –జంగయ్యయాదవ్, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల పేర్లను సిఫారసు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిన నియోకజవర్గాల్లో ఆయా అభ్యర్థులు విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లతో పాటు ఇంటింటికి తిరిగే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఏ హడావుడి లేకుండా తక్కువ మందితో కలిసి వెళ్తున్నారు. షెడ్యూల్‌ విడుదలైన తర్వాత భారీ ప్రచారానికి కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు