కోమటిరెడ్డి, వీహెచ్‌పై అధిష్టానం సీరియస్‌

21 Sep, 2018 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సొంత పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, సీనియర్‌ నేత వి. హనుమంతరావుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంగా ఆగ్రహంగా ఉంది. ఎన్నికల కమిటీల కూర్పును విమర్శిస్తూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన వీరిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కోమటిరెడ్డి, వీహెచ్‌ వ్యవహారంపై కమిటీ చర్చించింది.

కోమటిరెడ్డికి నోటీసులు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కుంతియా, కమిటీల ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఏఐసీసీ ఇంఛార్జ్, కమిటీల కూర్పు, కమిటీ సభ్యులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినట్లు గుర్తించామని పేర్కొంది. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మీడియా ముందు పార్టీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించినా పట్టించుకోకుండా పార్టీకి నష్టం జరిగేలా చేసిన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని కమిటీ తెలిపింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.

స్పందించిన కుంతియా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుంతియా తెలిపారు. వీరిద్దరి వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చ జరుగుతుందన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. కాగా, కుంతియా శనిలా దాపురించారంటూ కోమటిరెడ్డి గురువారం తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు.

మరిన్ని వార్తలు