హిట్లర్‌తో ఇందిరను పోల్చడంపై కాంగ్రెస్‌ ఫైర్‌

26 Jun, 2018 15:43 IST|Sakshi
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై దివంగత ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ఇందిరను నియంత హిట్లర్‌తో బీజేపీ పోల్చడాన్ని తప్పుపట్టింది. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా దిగ్గజ నేతగా వెలుగొందారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ అన్నారు. ఆమెను హిట్లర్‌తో పోల్చడం చరిత్రను వక్రీకరించడమేనని ట్వీట్‌ చేశారు.

ఇందిరా గాంధీని బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ హిట్లర్‌తో పోల్చడం అర్థం చేసుకోదగినదేనని, జైట్లీ ఆరెస్సెస్‌-బీజేపీ నేపథ్యంలో నుంచి వచ్చిన నేత ఇలానే మాట్లాడతారని అన్నారు. హిట్లర్‌ వంటి నియంతలు, ఫాసిస్టులను వీరు అనుసరిస్తారని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ విధించారని, దీనికి స్వయంగా ఇందిరా గాంధీయే విచారం వ్యక్తం చేశారని ఆనంద్‌ శర్మ గుర్తు చేశారు. అరుణ్‌ జైట్లీ జ్ఞాపకశక్తి కోల్పోయారని, నియంతలు ఎన్నికలు నిర్వహించరని అయితే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా హుందాగా ఓటమిని అంగీకరించారని అన్నారు.

>
మరిన్ని వార్తలు