సీబీఐ రభసపై కాంగ్రెస్‌ ఆందోళన

27 Oct, 2018 03:31 IST|Sakshi
సీబీఐ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న రాహుల్, కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఢిల్లీలో సీబీఐ కార్యాలయం వరకు భారీ ర్యాలీ

దేశ వ్యాప్తంగా నిరసనలు

ఢిల్లీలో రాహుల్‌ అరెస్టు, విడుదల

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అధికారాల్ని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఢిల్లీ లోధి రోడ్‌లోని దయాళ్‌సింగ్‌ కళాశాల నుంచి సీబీఐ ప్రధాన కార్యాలయం వరకు అధ్యక్షుడు రాహుల్‌ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించింది. పలువురు కాంగ్రెస్‌ నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు సుమారు 130 మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అశోక్‌ గెహ్లాట్, భూపిందర్‌సింగ్‌ హూడా, అహ్మద్‌ పటేల్, మోతిలాల్‌ వోహ్రా, వీరప్ప మెయిలీ, ఆనంద్‌ శర్మలతో పాటు శరద్‌ యాదవ్‌(లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌), డి.రాజా(సీపీఐ), నదిముల్‌ హక్‌(టీఎంసీ) తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సీబీఐలో అనూహ్యంగా జరిగిన అధికార మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు పట్నా, హైదరాబాద్, గాంధీనగర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్‌ తదితర పట్టణాల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలకు దిగారు. చండీగఢ్‌లో ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు.   

నిజం దాగదు..
అంతకుముందు, లోధిరోడ్‌లో ర్యాలీకి హాజరైన కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ..స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న అన్ని సంస్థల్ని ఎన్డీయే నాశనం చేస్తోందని మండిపడ్డారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పేరిట ప్రధాని నరేంద్ర మోదీ..రిలయన్స్‌ డిఫెన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు. మోదీ విచారణ నుంచి పారిపోతున్నా, సీబీఐ డైరెక్టర్‌ను పదవి నుంచి తొలగించినా నిజం మాత్రం దాగదని తేల్చిచెప్పారు. ‘చౌకీదార్‌(మోదీని ఉద్దేశించి) దొంగతనానికి పాల్పడటాన్ని అనుమతించం. వైమానిక దళం, యువత నుంచి ఆయన డబ్బు దొంగిలించిన సంగతి దేశం మొత్తానికి తెలుసు. మోదీ విచారణ నుంచి పారిపోయినా, నిజం బయటకు వస్తుంది’ అని పేర్కొన్నారు. నిజమేంటో ప్రధానికి చూపడానికే ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని అన్నారు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వం నిజాన్ని బంధించలేదని పేర్కొన్నారు. ర్యాలీకి సంబంధించిన, తాను జైలులో కూర్చున్నప్పటి ఫొటోలను రాహుల్‌ ట్వీట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు