పట్టణాల్లో పట్టుకోసం.. 

10 Nov, 2019 08:04 IST|Sakshi

హస్తం పార్టీకి కలిసొచ్చిన ఆర్టీసీ సమ్మె  

కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన కలెక్టరేట్ల ముట్టడి 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పట్టుకోసం పాకులాడుతోంది. 2014, 2018, 2019లో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడ్డ ఆ పార్టీ కనీసం మున్సిపల్‌ ఎన్నికల్లోనైనా సగానికి పైగా ‘పుర’ పీఠాలపై పాగా వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఎన్నికల తర్వాత మరో నాలుగున్నరేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో ఇందులో సత్తా చాటి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగే లోగా పట్టణాల్లో మరింత బలోపేతం అయ్యేలా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల ఆర్టీసీ కారి్మకుల సమ్మెకు మద్దతు తెలిపి.. నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచి్చంది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆయా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మరోపక్క.. త్వరలోనే మున్సిపల్‌ నగారా మోగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇకపై ప్రజల్లో మరింతగా దగ్గరయ్యేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా సభలు పూర్తి చేసుకున్న ఆ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిసారించింది.

పట్టణ సమస్యలపై స్పందించాలని ఆ పార్టీ శ్రేణులకు సూచించింది. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి దిశానిర్దేశం మేరకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరసనలతో పాటు పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు.

దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో జి.మధుసూదన్‌రెడ్డి, జడ్చర్లలో ఓబీసీ సెల్‌ రాష్ట్ర నాయకుడు బాలవర్ధన్‌గౌడ్, వనపర్తిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ప్రసాద్, నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకట్రాములు, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మణెమ్మ, కల్వకుర్తిలో ఆనంద్‌కుమార్, అచ్చంపేటలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ,  జోగులాంబ గద్వాలలో జిల్లా అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, అలంపూర్‌లో సదానందమూర్తి, నారాయణపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ బండి వేణుగోపాల్, మక్తల్‌లో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్రీహరి ఆధ్వర్యంలో ఆందోళనలతో పాటు పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

అభ్యర్థిత్వాలపై ఆచితూచి  
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోన్న కాంగ్రెస్‌ నేతలు అభ్యర్థిత్వాల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 2014, 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చాలా మంది గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలుపొందిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం కారెక్కారు. ఈ వలసలతో ఉమ్మడి జిల్లాలో ‘హస్తం’వ్యస్తమైంది.

అయితే ఈ సారి జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎంపిక చేసే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గెలిచిన తర్వాత ‘చేయి’ ఇవ్వని వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం పని చేసేవారికే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించిన ఆ పార్టీ ఇప్పటికే పది వార్డులకు ఒకటి చొప్పున అన్ని మున్సిపాలిటీల్లో కమిటీలు వేసింది. ప్రతి కమిటీలో ముగ్గురు సీనియర్‌ నాయకులను నియమించింది.

అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించిన త్రీమెన్‌ కమిటీ వార్డుల్లో గెలిచే స్థాయిలో ఉన్న ఆశావహుల వివరాలు సేకరించి జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు నివేదికలు అందజేసింది. పలు వార్డుల్లో అభ్యర్థిత్వాల ఖరారు కసరత్తు ప్రక్రియ తుది దశలో ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఎలా ఢీ కొంటుంది? ఎన్ని ‘పుర’ పీఠాలు కైవసం చేసుకుంటుంది? అనే చర్చ మొదలైంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా