రాహుల్‌పై పోటీకి కాంగ్రెస్‌ ఆహ్వానం

5 Oct, 2017 09:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీకి పగ్గాలు అప్పజెప్పే ప్రయత్నాలు ఓవైపు కొనసాగుతుండగానే... మరోవైపు పార్టీ ఓ ప్రకటన చేసింది. అధ్యక్ష పదవి కోసం నిర్వహించే ఎన్నికల్లో రాహుల్‌తో ఎవరైనా పోటీ పడొచ్చని పేర్కొంది. 

గాంధీ వారసత్వంలోనే పార్టీ కొనసాగుతుందా? అన్న అనుమానాలు వద్దు. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉంది. అందుకే కీలక పదవుల కోసం ఎవరైనా పోటీ పడొచ్చు అని ఏఐసీసీ ప్రతినిధి రణ్‌దీప్‌ సుజ్రేవాలా తెలిపారు. పైగా కాంగ్రెస్‌లో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా పోటీలు కూడా జరిగాయన్న విషయాలను ఆయన ప్రస్తావించారు. గతంలో ఓసారి సోనియా గాంధీతో.. దివంగత నేత జితేంద్ర ప్రసాద్ పోటీ పడ్డారని రణ్‌దీప్‌ గుర్తు చేశారు. 

ఇందిరా గాంధీ ఆశయాల మేరకు ప్రజాస్వామ్య సవాళ్ల నుంచి కాంగ్రెస్ ఎప్పుడూ తప్పించుకోలేదన్న రణ్‌దీప్‌.. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరిపై ఒకరు పోటీకి దిగారన్న విషయాన్ని ఉటంకించారు. అయితే ప్రస్తుతం అందరు నేతలు సూచించే ఏకైక పేరు రాహుల్ గాంధీయేనని, ప్రజాస్వామ్య బద్ధంగా ఆ పదవికీ ఆయన అన్ని విధాల అర్హుడని సూర్జేవాలా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోపు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి రాహుల్‌ గాంధీకి అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఏఐసీసీ శ్రేణులు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు