కర్ణాటకలో బీజేపీకి నిరాశ

7 Nov, 2018 00:59 IST|Sakshi
జాంఖండిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుతో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు

ఉప ఎన్నికల్లో 5 స్థానాలకు ఒక్కచోటే గెలిచిన కాషాయ పార్టీ

15 ఏళ్లలో తొలిసారిగా బళ్లారిలోనూ ఓటమి

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌– జేడీఎస్‌ కూటమి విజయం

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు బీజేపీకి నిరాశను మిగిల్చాయి. మొత్తం ఐదు స్థానాల్లో ఒక్కచోట మాత్రమే బీజేపీ గెలవగా, మిగిలిన నాలుగు స్థానాల్లోనూ కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి విజయం సాధించింది. 15 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బళ్లారి లోక్‌సభ స్థానంలో ఈసారి కాంగ్రెస్‌ ఏకంగా 2.43 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.

అటు కలహాలు, విభేదాలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి ఈ ఉప ఎన్నికల్లో విజయంతో కొత్త ఉత్సాహం లభించింది. ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప మాట్లాడుతూ డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారానే కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ఉప ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు.

ఈ ఏడాది మేలో మొత్తం 224 స్థానాలకు శాసనసభ ఎన్నికలు జరగ్గా బీజేపీకి సంపూర్ణ ఆధిక్యం రానప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా ప్రమాణం చేసి రెండ్రోజుల్లోనే పదవి కోల్పోవడం, జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే. తాజా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం అసెంబ్లీలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ కూటమి బలం 120కి చేరగా, బీజేపీకి 104 మంది సభ్యులున్నారు.  

శివమొగ్గ స్థానాన్ని నిలుపుకున్న బీజేపీ
యడ్యూరప్ప శివమొగ్గ నుంచి, మరో బీజేపీ నేత శ్రీరాములు బళ్లారి నుంచి, జేడీఎస్‌కు చెందిన సీఎస్‌ పుట్టరాజు మండ్య నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు. మేలో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ వీరు పోటీచేసి గెలిచి లోక్‌సభకు రాజీనామా చేయడంతో తాజా ఉప ఎన్నికలు జరిగాయి. అటు సీఎం కుమారస్వామి మేలో రామనగర, చెన్నపట్న అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. అనంతరం రామ నగర స్థానానికి ఆయన రాజీనామా చేశారు.

ఇక జాంఖండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్‌ నేత సిద్దూ న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో మొత్తం ఐదు స్థానాలకు గాను శివమొగ్గలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. యడ్యూరప్ప కొడుకు బీవై రాఘవేంద్ర జేడీఎస్‌ అభ్యర్థి మధు బంగారప్పపై 52 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మండ్యలో జేడీఎస్‌ నేత శివరామె గౌడ బీజేపీ అభ్యర్థి సిద్ధరామయ్యపై 3.24 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేశారు.

ఇక రామనగర అసెంబ్లీ స్థానంలో కుమార స్వామి భార్య అనిత 1.09 లక్షల ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై గెలుపొందారు. వాస్తవానికి కాంగ్రెస్‌కు చెందిన చంద్రశేఖర్‌ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి, నామినేషన్‌ వేసిన అనంతరం ఆ పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదంటూ తిరిగి కాంగ్రెస్‌ గూటికి వచ్చారు. అయితే అప్పటికే నామినేషన్‌ వేసినందున బీజేపీ తరఫున ఆయన పోటీలో ఉన్నట్లుగానే భావించారు. అటు జాంఖండి అసెంబ్లీ నియోజకవర్గంలో సిద్ధూ న్యామగౌడ కొడుకు ఆనంద్‌ న్యామగౌడ 39,480 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిని ఓడించారు.

సతీసమేతంగా అసెంబ్లీకి సీఎం
సీఎం కుమారస్వామి భార్య అనిత రామనగర స్థానం నుంచి ఉప ఎన్నికలో విజయం సాధించడంతో కర్ణాటక అసెంబ్లీలో కొత్త రికార్డు నమోదైంది. కుమారస్వామి ప్రస్తుతం చెన్నపట్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో కర్ణాటక శాసనసభలో సీఎం, ఆయన భార్య ఏకకాలంలో సభ్యులుగా ఉండటం ఇదే తొలిసారి కానుంది.


బీజేపీ చేజారిన బళ్లారి
బళ్లారి లోక్‌సభ స్థానంలో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకుంది. గనుల వ్యాపారి గాలి జనార్దన్‌ రెడ్డి సోదరుల అండతో 2004 నుంచి బళ్లారిలో  బీజేపీయే గెలుస్తోంది. తాజా ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి, శ్రీరాములు సోదరి జె.శాంతపై కాంగ్రెస్‌ నేత వీఎస్‌ ఉగ్రప్ప 2.43 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు.

ఎన్నికల్లో బీజేపీ గాలి సోదరులను పక్కనబెట్టగా ఉపఎన్నిక కోసం తుమకూరు జిల్లా పావగడకు చెందిన వాల్మీకి వర్గానికి చెందిన ఉగ్రప్పను కాంగ్రెస్‌ పోటీలో నిలిపింది. ఈయన తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు. బళ్లారిలో కన్నడ కన్నా తెలుగు వారే అధికం. కుల సమీకరణాలతోపాటు భాషా కారణాల వల్లే ఉగ్రప్ప భారీ విజయం సాధించారని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు