రాహుల్‌కు తోడుగా..! 

30 Jun, 2019 02:59 IST|Sakshi

రాజీనామాల బాటలో టీపీసీసీ నేతలు 

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రేవంత్‌ రాజీనామా...అదే బాటలో వీహెచ్‌ 

ఇప్పటికే పొన్నం రాజీనామా... రాహుల్‌ స్ఫూర్తితోనేనని రేవంత్‌ ప్రకటన 

త్వరలోనే పార్టీ వ్యవహారాల ఇంచార్జి మార్పు జరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీకి మద్దతుగా రాష్ట్రంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.రాహుల్‌గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరుతూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి పొన్నం ప్రభాకర్‌ ఇప్పటికే రాజీనామా చేయగా, మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి కూడా రాహుల్‌కు అండగా నిలిచారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. దీంతో రాహుల్‌కు మద్దతుగా ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లకు తోడు మరో సీనియర్‌ నేత రాజీనామా చేసినట్టయింది. మరికొందరు నేతలు కూడా నేడో, రేపో రాజీనామాలు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

కుంతియాపై ఫిర్యాదు 
రాహుల్‌కు మద్దతుగా నిలుస్తూ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని అధిష్టానానికి ఫ్యాక్స్‌ పంపిన మాజీ ఎంపీ వీహెచ్‌ కూడా తన రాజీనామా లేఖలో ట్విస్ట్‌ పెట్టారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత రాహుల్‌ ఒక్కరిదే కాదని, అందరూ నేతలు ఆ బాధ్యతను తీసుకోవాలని తన రాజీనామా లేఖలో చెప్పిన వీహెచ్‌ అదే లేఖలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియాపై అధిష్టానానికి పరోక్షంగా ఫిర్యాదు చేశారు. ‘ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ప్రాథమికంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంచార్జుల విధి నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. వారు పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకుని పోతున్నారా లేక పార్టీలోని ఓ వర్గంతో కుమ్మక్కయ్యారా అనేది కూడా చూడాలి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సరైన రిపోర్టు ఇస్తున్నారా లేదా చూడాలి. అలాకాకుండా ఒక్క ఇంచార్జి ఇచ్చే రిపోర్టులను గుడ్డిగా పార్టీ నాయకత్వం నమ్మకుండా ఉండాల్సింది.’అని ఆయన కుంతియా వ్యవహారశైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. 

త్వరలోనే మార్పు 
కాగా, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా స్థానంలో త్వరలోనే మరో నేత వస్తారనే ప్రచారం గాంధీభవన్‌ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏఐసీసీ కోర్‌కమిటీ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టిందని, అందులో భాగంగా వచ్చే నెల 1,2 తేదీల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రల సమీక్ష ఉంటుందని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంపైనే అధిష్టానం దృష్టి పెడుతుందని అంటున్నారు. అదే జరిగితే వచ్చే నెల మొదటి వారంలోపు కుంతియా మార్పు తథ్యమని చెపుతున్నారు.   

రాహుల్‌ స్ఫూర్తితోనే..
కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా తన రాజీనామాను ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు కీలక హోదాల్లో ఉన్న నేతలు బాధ్యత వహించాలన్న రాహుల్‌గాంధీ స్ఫూర్తిగా తీసుకుని తాను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవులను త్యజించాల్సిందేననే కోణంలో ఆయన చేసిన రాజీనామా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఇరుకున పెట్టేదేనని పార్టీ వర్గాలంటున్నాయి. ముందస్తు ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లోనూ వరుసగా> పార్టీ ఓటమి పాలవుతున్నా రాజీనామాను ప్రకటించని ఉత్తమ్‌ వైఖరిని రేవంత్‌ రాజీనామా ప్రశ్నించిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే, ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే ఫలితాలు వెలువడిన వెంటనే చేయకుండా రాహుల్‌కు మద్దతుగా చేయడమేమిటనే ప్రశ్న కూడా రేవంత్‌ శిబిరం వైపు కొందరు వేలెత్తి చూపుతున్నారు. మొత్తంమీద రాజకీయంగా ఎప్పుడూ వార్తల్లో ఉండే రేవంత్‌ ఈసారి కూడా తనదైన శైలిలో రాజీనామాను ప్రకటించి అటు పార్టీలోనూ, ఇటు అధిష్టానం దృష్టిలోనూ చర్చనీయాంశం కావడం గమనార్హం.   

మరిన్ని వార్తలు