రాహుల్‌ ‘చాతుర్యం’ బీజేపీకి వరమా?

8 May, 2019 05:10 IST|Sakshi

 కాంగ్రెస్‌ అహంకారపూరిత, విచిత్ర వైఖరి ప్రతిపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీస్తోందన్న చర్చ రాజకీయ శ్రేణుల్లో విస్తృతంగా జరుగుతోంది. ఢిల్లీ పీఠం నుంచి బీజేపీని దించడమే ప్రధానలక్ష్యంగా మిత్రపక్షాలు 2019 ఎన్నికల బరిలోకి దూకాయి.

అయితే కాంగ్రెస్‌ అతి పెద్ద ప్రాంతీయ పార్టీయే తప్ప జాతీయ పార్టీకాదంటూ విమర్శలువెల్లువెత్తుతోన్న నేపథ్యంలో తల్లి సోనియాకున్న రాజకీయ చతురత కొడుక్కి కొరవడడం, రాహుల్‌ రాజకీయ అపరిపక్వతా వెరసి కాంగ్రెస్‌ వ్యవహారం మిత్రపక్షాల ఐక్యతకు గండికొడుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. 

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రమారమీ 100 కు మించి సీట్లురావంటోన్న తరుణంలో ప్రతిపక్ష భాగస్వామ్య పక్షాలను సమానంగా చూడటం, భావసారూప్యత గల పార్టీలతో కనీస అవగాహనతో నడవడంలో రాహుల్‌  వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. మిత్రపక్షాల సఖ్యతకు భిన్నంగా యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చివరకు కేరళలో సైతం బీజేపీతో పోటీ పడాల్సిన చోట వయనాడ్‌లో సీపీఐపై పోటీకి దిగడం తన పతనాన్ని తానే కొనితెచ్చుకొనే పరిస్థితికి దారితీస్తోందన్న వాదనకు బలంచేకూరుతోంది.  

మధ్యప్రదేశ్‌లో మాయావతికి కోపం తెప్పించి... 
పదిహేనేళ్ళ తరువాత చేజిక్కించుకున్న మధ్యప్రదేశ్‌లో పాలకపక్షం పోకడలు రాష్ట్ర ప్రభుత్వ ఉనికికే ప్రమాదకరంగా మారాయి. ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ప్రవర్తిస్తోన్న తీరు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రహానికి కారణమవుతోంది. ఇది తక్షణం ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకుతోడు మిత్రపక్షాలతో వ్యవహరిస్తోన్న తీరు తక్షణం ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తోంది. ఇదే రేపు ఎన్నికల అనంతర పరిణామాల్లో సమూల మార్పుకి కారణమవుతుందనీ ఆ మార్పు కాంగ్రెస్‌కి తీరని నష్టం చేకూరుస్తుందని కూడా రాజకీయ నిపుణుల అంచనా. ఒకవేళ మధ్యప్రదేశ్‌లో మాయావతి కాంగ్రెస్‌కిచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటే సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్‌ యాదవ్‌ సైతం అదే ఒరవడిలో నడవటం ఖాయం. మొత్తంగా ఈ పరిణామాలు కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని అధికారంలోకూర్చోబెట్టాలన్న ప్రతిపక్షాల ఎజెండాకి ముందుగానే విఘాతం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వెరసి పరిణామాలన్నీ కాంగ్రెస్‌కన్నా బీజేపీకే ఉపయోగపడతాయన్న భావనకి బలంచేకూరుతోంది. రాజకీయాల్లో ఆరితేరినవాడూ, అపరచాణక్యుడూ అయిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో జ్యోతిరాదిత్య సింధియాకీ మధ్య సంబంధాలు సర్కారును ఇరకాటంలో పెట్టే పరిస్థితికి దారితీస్తున్నాయని భావిస్తున్నారు. ఓ పక్క జ్యోతిరాదిత్య సింధియా వ్యవహార శైలి మాయావతికి కోపంతెప్పిస్తోంటే, ఒప్పందంలో భాగంగా ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వకపోవడం కమల్‌నాథుడిపై అఖిలేష్‌ యాదవ్‌ కినుకకి కారణం కావడం మిత్రపక్షాల ఐక్యతకు ముప్పుగా మారింది. మధ్యప్రదేశ్‌లోని గుణలో జ్యోతిరాదిత్య సింధియాకి వ్యతిరేకంగా పోటీ చేస్తోన్న బీఎస్పీ అభ్యర్థి లోకేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ని జ్యోతిరాదిత్య సింధియా తనవైపుకి తిప్పుకోవడం గుణలో మే 4వ తేదీన జరగాల్సిన మాయావతి సభ రద్దుచేసుకోవాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా గుణలో బరిలోకి దించిన లోకేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ ఆ పార్టీని వీడి జ్యోతిరాదిత్య సింధియాతో చేతులు కలిపి, కాంగ్రెస్‌ సరసన చేరడం మాయావతి కోపానికి కారణమయ్యింది.

దీనికి తోడు సింధియా రాజ్‌పుత్‌కి ఆహ్వానం పలుకుతూ ట్వీట్‌ చేయడం మరింత ఆజ్యం పోసింది. కాంగ్రెస్‌ బీజేపీలకు పెద్ద తేడాలేదనీ, ఇటు కాంగ్రెస్‌గానీ, అటు బీజేపీగానీ విశ్వసించదగినవి కావంటూ మాయావతి కామెంట్‌ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను బెదిరించడంలో బీజేపీగానీ, కాంగ్రెస్‌గానీ ఒకేరకంగా వ్యవహరిస్తాయని ఆమె ట్విట్టర్‌లో తేల్చి చెప్పారు.  గత డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతుని మాయావతి ఇచ్చింది. అయితే ఏ క్షణంలోనైనా మాయావతి తన అభిప్రాయాన్ని మార్చుకోవచ్చని అంతా భావిస్తున్నారు. అయితే ఆ పరిస్థితి కొంత ముందే రావడానికి కాంగ్రెస్‌ అహంభావ వైఖరి ఉపయోగపడిందని విశ్లేషకుల అభిప్రాయం.

తన పార్టీ వైఖరిని సమర్థించుకోవడం కూడా కమల్‌నాథ్‌కి కష్టంగా మారింది. తాజా పరిణామాలతో మాయావతి మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్‌ పరిస్థితి చేయిదాటిపోతుంది. దీనికి తోడు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని నలుగురు స్వతంత్ర అభ్యర్థులతో బీజేపీ మంతనాలు సాగిస్తోందన్న వార్తలొస్తున్నాయి. నిజానికి బీఎస్పీ నుంచి ఒకేఒక్క అభ్యర్థిని తమవైపు తిప్పుకోవడం ద్వారా అధికారాన్ని కోల్పోవడం తప్ప కాంగ్రెస్‌కి ఒరిగేదేమిటన్న ప్రశ్న మిత్రపక్షాల ఐక్యతను కోరుకుంటున్న వారిని వేధిస్తోంది. ఏదేమైనా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌కి తిప్పలు తప్పేట్టులేవని అంతా అభిప్రాయపడుతున్నారు.  

రాజస్తాన్‌లోనూ కీచులాటలు...     
రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెçహ్లాత్‌ జోధ్‌పూర్‌ నుంచి తన కొడుకుని గెలిపించుకోవడం కోసం మిగిలిన 24 మంది అభ్యర్థులనూ నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు పార్టీలో అంతర్గత అశాంతికి కారణమయ్యాయి. ఇదిలా ఉండగా ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్, ముఖ్యమంత్రి కుమారుడి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడమే కాకుండా తిరస్కారంగా కీలకంగా భావిస్తోన్న లోక్‌సభ ఎన్నికల్లో నామమాత్రపు పాత్ర పోషించారు. అసలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన అనుచరుల 2019 ఎన్నికల ప్రధాన ఎజెండా బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించడమా? లేక ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడమా అన్నదానిలో రాహుల్‌కి స్పష్టత లేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది. రాహుల్‌ గాంధీకి ఈ రెండింటినీ నెరవేర్చగల శక్తిలేదు. ఈ వైరుధ్యమే బీజేపీని సంపూర్ణంగా ఓడించలేని స్థితికీ, మిగిలిన ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌ వ్యతిరేకులుగా మారడానికీ కారణమౌతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

యూపీలో మహాగబంధన్‌ దెబ్బతీసే వ్యవహారం... 
ఉత్తరప్రదేశ్‌లో మహాగబంధన్‌ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుండడం అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందులో భాగంగానే ప్రియాంకా వాద్రా వ్యాఖ్యలను చూడాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దాదాపు 70 లోక్‌సభ సీట్లకు పోటీచేయడం ద్వారా బీజేపీకి మేలు చేస్తోందన్న విమర్శకు జవాబుగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(తూర్పు యూపీ) ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదం సృష్టించాయి. ‘‘మా అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్‌ గెలుస్తుంది.

అభ్యర్థులు కాస్త బలహీనంగా ఉన్న స్థానాల్లో వారు బీజేపీకి పడాల్సిన ఓట్లను చీల్చుకుంటారు,’’అని ప్రియాంక ఇటీవల రాయ్‌బరేలీలో చెప్పారు. బలహీన అభ్యర్థులు పరోక్షంగా ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహా కూటమి గెలుపునకు సాయపడతారనేది ఆమె ఉద్దేశం. అత్యధిక స్థానాల్లో పోటీ వల్ల తాము బీజేపీకి సాయపడడం లేదని ఆమె చెప్పారు. అయితే అనేక నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపామని చెప్పడం ద్వారా తమకు బలం లేని స్థానాలు చాలా ఉన్నాయని, అక్కడ తమకు గెలిచే అవకాశాలు లేవని ఆమె అంగీకరించినట్టయింది. 

కాంగ్రెస్‌కు బలం లేదని చెప్పలేకే ప్రియాంక సాకులు? 
ప్రియాంక ప్రకటనకు ఎస్పీ నేత, యూపీ మాజీ సీఎం ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో ప్రజల మద్దతు లేనందు వల్లే ప్రియాంక తన ప్రకటన ద్వారా సాకులు చెబుతున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్‌ ఎక్కడా బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని నేను భావించడం లేదు. ఏ పార్టీ అలా చేయదు. జనం కాంగ్రెస్‌ పక్షాన లేనందునే ప్రియాంక ఇలాంటి మాటలు చెబుతున్నారు,’’అని ఆయన చెప్పారు. ప్రియాంక ప్రకటన తర్వాత మహా కూటమికి కాంగ్రెస్‌కు రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం మొదలైంది. అలాంటిదేమీ లేదని అఖిలేశ్‌ ఖండించారు. 

పోటీ బీజేపీ, మహాకూటమికి మధ్యనేనని ప్రియాంక అంగీకరించారా? 
కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థులున్నచోటే గెలుస్తుందని, లేని స్థానాల్లో బీజేపీ ఓట్లు చీల్చుకుంటుందని చెప్పడం ద్వారా కాషాయపక్షానికి ఎస్పీ, బీఎస్పీ కూటమే బలమైన ప్రత్యర్థి, ప్రత్యామ్నాయమని ప్రియాంక ఒప్పుకున్నట్టయింది. 2022లో జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన చెల్లెలు ప్రియాంక పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల అనేకసార్లు ప్రకటించారు.

ఇదే నిజమైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌ లక్ష్యాల్లో ఒకటి మాత్రమే. 2014 పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో కేవలం రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌కు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 7.5 శాతం ఓట్లే దక్కాయి. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన పార్టీగా కాంగ్రెస్‌ బరిలోకి దిగాలంటే ఈ లోగా బలం పెరగాలి. 70కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోటీచేసి గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించడం రెండో లక్ష్యంగా కనిపిస్తోంది.  

సోనియమ్మ రాజకీయాలు రాహుల్‌కి వంటబట్టలేదా? 
మొత్తంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఉన్న రాజకీయ చతురతా, కొంత తగ్గిఅయినా మిత్రపక్షాలను మెప్పించగల సమర్థతా రాహుల్‌గాంధీలో కొరవడినట్టు రాజకీయ నిపుణులు అంచనావేస్తున్నారు. 2004లో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ని యూపీఏలో కలుపుకోవడం కోసం పొరుగింట్లోనే ఉన్న రామ్‌విలాస్‌ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సోనియాగాంధీ రాజకీయ పరిణతి రాహుల్‌గాంధీలో కొరవడిందని పలువురి భావన. ఏది ఏమైనా మిత్రపక్షాలనూ, ప్రాంతీయ పార్టీలనూ కలుపుకుపోవడంలో సోనియా గాంధీకి ఉన్న తెలివితేటలుగానీ, ప్రత్యర్థులను చిత్తుచేయడం కోసం అవసరమైతే తనను తాను తగ్గించుకోగల రాజకీయ నేర్పరితనం గానీ రాహుల్‌గాంధీలో కనిపించడం లేదని ఈ ఎన్నికలు రుజువుచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

మరిన్ని వార్తలు