రాష్ట్ర నాయకత్వమే ఓటమికి బాధ్యత వహించాలి!

12 Dec, 2018 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం నాయకుల్లో అంతర్మధనం మొదలైంది. కూటమి ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పొంగులేటి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..సెంటిమెంట్‌ మీద ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణా అని, అలాంటి రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడంలో నాయకత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ ఉన్న పరిస్థితిని కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబుగా తీసుకురావడంలో కేసీఆర్‌ సఫలమయ్యారని, అందువల్లే తాము ఓడిపోయామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో తాము గెలిచినా కూడా తెలంగాణాలో ఓడిపోవడం బాధాకరంగా ఉందన్నారు. అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, రాష్ట్రం ఇచ్చి కూడా ప్రచారం చేయలేక 2014లో ఓడిపోయామని చెప్పారు.

 ఏమాయ జరిగిందో ఏమో కానీ ప్రజాకూటమి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లగడపాటి సర్వే, ఎగ్జిట్‌ పోల్‌లు కూడా తలకిందులు అయ్యాయని అన్నారు. ఏఐసీసీని తప్పుపట్టడం లేదని.. రాష్ట్ర నాయకత్వంలోనే ఎక్కడో తప్పు జరిగిందని, దానిని తెలుసుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగాలని కోరారు. రెండో సారి ముఖ్యమంత్రి అవుతున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు