ఢిల్లీ కాంగ్రెస్‌లో కుదుపు!

5 Jan, 2019 08:22 IST|Sakshi

అధ్యక్ష పదవికి అజయ్‌ మాకెన్‌ రాజీనామా

ఆరోగ్య పరిస్థితులే కారణమంటున్న పార్టీ శ్రేణులు

మాకెన్‌కు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీలో కీలక బాధ్యతలు!

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం పెద్ద కుదుపు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న అజయ్‌ మాకెన్‌ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను ఉటంకిస్తూ ఆయన రాజీనామా సమర్పించారని అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి  పీసీ చాకో,  అజయ్‌మాకెన్‌ గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశారని, రాహుల్‌ గాంధీ ఆయన  రాజీనామాను అంగీకరించారని  పార్టీ వర్గాలు అంటున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పరాజయం తరువాత 54 సంవత్సరాల అజయ్‌ మాకెన్‌  ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు.

సహకారం అందించినందుకు కృతజ్ఞతలు: మాకెన్‌
తన రాజీనామా విషయాన్ని అజయ్‌ మాకెన్‌ ట్వీట్‌ చేసి తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌  అధ్యక్షునిగా çతనకు  అందించించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల తరువాత తనకు పార్టీ కార్యకర్తల నుంచి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను కవర్‌ చేసే మీడియా నుంచి, రాహుల్‌ గాంధీ నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితులలో నాయకత్వం సులభం కాదని, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు.

సెప్టెంబర్‌లోనే వార్తలు...
మాకెన్‌ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసినట్లు సెప్టెంబర్‌లో కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆరోగ్య కారణాల వల్లనే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం ఆయన రాజీనామా వార్తను ఖండించింది. ఈసారి కూడా రాజీనామాకు కారణాన్ని మాకెన్‌  వెల్లడించలేదు. కానీ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ çపార్టీ  పొత్తు కుదుర్చుకుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామాపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి.  ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య పొత్తును మాకెన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. మాకెన్‌ను మళ్లీ  అఖిల బారత కాంగ్రెస్‌ కమిటీలో కీలక  బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.

రేసులో షీలాదీక్షిత్‌..
మాకెన్‌ డీపీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ ఆ పదవిని ఆక్రమిస్తారని కూడా పార్టీలో కొందరు అంటున్నారు. పార్టీ అధిష్టానం కోరితే తిరిగి ఢిల్లీ రాజకీయాలలో పాత్ర పోషించేందుకు తాను సిద్ధమని, అధిష్టానం కుదుర్చుకునే పొత్తులు తనకు ఆమోదయోగ్యమని ఆమె ఇదివరకే ప్రకటించారు. పొత్తు ఊహాగానాలను కాంగ్రెస్, ఆప్‌ కూడా ఖండించడం లేదు. కాంగ్రెస్‌ నేతలు యోగానందశాస్త్రి, రాజ్‌కుమార్‌ చౌహాన్, హరూన్‌ యూసఫ్, చతర్‌ సింగ్‌ల పేర్లను కూడా పార్టీ డీపీసీసీ అధ్యక్షపదవికి  పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రెండు మూడు రోజులు అమే«థీ పర్యటనకు వెళ్తున్నందువల్ల  డీపీసీసీ అధ్యక్షపదవిపై నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటారని వారు చెప్పారు. 

మరిన్ని వార్తలు