పీవీ, ప్రణబ్‌లు అంటే అపార గౌరవం : చిన్నారెడ్డి

27 Jun, 2019 19:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ లు అంటే తనకు అపారమైన గౌరవమని, వాళ్ళు గొప్ప మేధావులు కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు గొప్ప అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. పీవీ నర్సింహారావు, ప్రణబ్ ముఖర్జీ లపై బుధవారం తాను చేసిన ప్రకటనలపై  వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పివి, ప్రణబ్ లను కాంగ్రెస్ అవమానించిందని అనడం రాజకీయమని, కాంగ్రెస్ పార్టీ వారికి గొప్ప గౌరవం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకని తాను ప్రశ్నించానే తప్ప వాళ్ళను అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. పీవీ, ప్రణబ్‌ అంటే ఎంతోఅభిమానం, గౌరవం ఉందని అన్నారు. తన వాఖ్యలపై కొంతకొంత అపార్థాలు చోటు చేసుకున్నాయని, ఎవరైనా బాధ పడితే చింతిస్తున్నానని అన్నారు. పివి, ప్రణబ్ లు ఎప్పటికైనా కాంగ్రెస్ గౌరవించే నేతలని ఆయన వివరణ ఇచ్చారు.

(చదవండి : పీవీపై కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి అనుచిత వాఖ్యలు)

కాగా బుధవారం చిన్నారెడ్డి పీపీ, ప్రణబ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి చేసిన సోనియా గాంధీని, ఆమె అనుచరులను పీవీ అణగదొక్కారని ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి పీవీ అని విమర్శించారు. ఇక మాజీ రాష్ట్రపతి​  ప్రణబ్‌ ముఖర్జీ నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్‌ సభకు వెళ్లి భారతరత్న తెచ్చెకున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు