దొరతనానికి చరమగీతం పాడాలి: రాజనర్సింహ

29 Mar, 2019 16:27 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహ(పాత చిత్రం)

సంగారెడ్డి: ఇందిరా గాంధీని ప్రధానిని చేసిన ఘనత జహీరాబాద్‌ ప్రజలదని, నాయకులు పోయినంత మాత్రాన కాంగ్రెస్‌ ఓట్లు ఎటూ పోవని మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మదన్‌ మోహన్‌ రావుతో కలిసి మునిపల్లి వచ్చారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ..  కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమన్నారు. విద్యా, సమాచార హామీ హక్కులను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందని తెలిపారు. 14 మంది ఎంపీలతో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల గురించి ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం పార్లమెంటులో ఏ ఒక్క రోజు మాట్లాడని వారు, ఇప్పుడు 16 ఎంపీ స్థానాలు గెలిపించమని అడగడానికి  సిగ్గు అనిపించడం లేదా అని అన్నారు.

30 శాతం మంది రైతులకు రైతుబంధు అందలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌పై నామినేషన్లతో రైతులు తిరగబడ్డారని అన్నారు. దొరతనం, దురహంకారానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్‌లో అభద్రత ఉంది.. అందుకే కాంగ్రెస్‌ నుంచి వలసలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా జీవన్‌ రెడ్డి ఎన్నిక ప్రజాస్వామ్యానికి ఊపిరి అని వ్యాఖ్యానించారు. పెన్షనర్లను భయపెట్టడం, రైతుబంధు పథకం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు సిద్ధాంతం ఉందని, కార్యకర్తలకు ధైర్యం ఉందని చెప్పారు. సింగూరు నుంచి 16 టీఎంసీల నీటిని కూతురు కోసం తీసుకెళ్లాడని ఆరోపించారు. కారు..సారు.. పదహారు కాదు..దోచుకో..దాచుకో..దాటిపో అన్నదే కేసీఆర్‌ సిధ్ధాంతమన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందంటారా.. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది..ప్రాజెక్టులు కట్టిందని వ్యాఖ్యానించారు.

ఏటా రూ.72 వేల సహాయం: మదన్‌

కాంగ్రెస్‌ బడుగుల పార్టీ అని జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ రావు కొనియాడారు. కనీస ఆదాయ పథకం ద్వారా ఏటా రూ.72 వేల సహాయం అందిస్తామన్నారు. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌, రైతు రుణాలను మాఫీ చేసిందని చెప్పారు. బీబీ పాటిల్‌ పనికి రాని అసమర్థ ఎంపీ అని మండిపడ్డారు. ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఖర్చు చేయలేని అసమర్థ ఎంపీ బీబీపాటిల్‌ అని విమర్శించారు. ప్రజల సమస్యలు తీర్చడం మరిచి తన సొంత వ్యాపార పనులు చక్కదిద్దుకున్నాడని ఆరోపించారు. నిరుద్యోగులు లేని జహీరాబాద్‌ను చూడాలనేదే తన కల అన్నారు. అద్దంలా జహీరాబాద్‌ను తయారు చేస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు