ఆ మంత్రికి టికెట్‌ రాదు.. వస్తే డిపాజిట్‌ రాదు..!

15 Jul, 2018 16:14 IST|Sakshi

సాక్షి, నల్గొండ : ‘నాకు మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవి వద్దు.. కేసీఆర్‌ను గద్దె దింపడమే ధ్యేయంగా పనిచేస్తానని’ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతిలో నలిగిపోతుందని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాక వారి చేతిలో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు నల్గొండలో పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విదేశాల నుంచి విమానాలలో మిషనరీ తెస్తున్నారు.. కానీ నల్గొండలోని ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులకు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ మంత్రి జగదీశ్‌ రెడ్డిపై కోమటిరెడ్డి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డికి టికెట్‌ రాదని.. ఒకవేళ టికెట్‌ వచ్చినా డిపాజిట్‌ కూడా దక్కదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌, 12 అసెంబ్లీ సీట్లను గెలిపించి కాంగ్రెస్‌ పార్టీ సినీయర్‌ నాయకురాలు సోనియాగాంధీకి అంకితం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఎలాగైనా తనను తప్పించి, శాసనసభ్యత్వం రద్దు చేసి, గన్‌మెన్‌లను తీసేశారని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని బయటికి తీస్తామని ఆయన ధ్వజమెత్తారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, కొత్త ప్రాజెక్టులు కడితే కమిషన్‌లు వస్తాయని, పాత ప్రాజెక్టులు పూర్తి చేయడంలేదని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి విమర్శించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారు..
ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కాకలు తీరిన కార్యకర్తలు.. ఉద్దండులైన నాయకులందరూ నల్గొండలో ఉన్నారన్నారు. జిల్లా ప్రజలు అవసరం వచ్చినప్పుడు తమ శక్తిని చూపెడతారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారని జానారెడ్డి గుర్తు చేశారు. జిల్లాకు వీర చరిత్ర ఉంది.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కానుకగా అన్ని స్థానాలు గెలిపించి ఇవ్వాలని జానారెడ్డి కోరారు.

ఈ పార్లమెంట్‌ స్థాయి సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌, కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ పద్మావతి, దామోదర్‌ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్‌, భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన వారికి బాణసంచా కాల్చి కోమటిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు