ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

22 Dec, 2018 11:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కొండామురళితో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఉన్నారు. వరంగల్‌ స్థానిక సంస్థల ద్వారా కొండా మురళి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా 2015లో ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ తొలుత ప్రకటించిన జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురైన కొండా దంపతులు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున పరకాల నుంచి పోటీచేసిన కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ.. శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వివరణ కోరుతూ కొండా మురళికి నోటీసులు జారీ చేశారు. దీంతో 2021వరకు పదవీ కాలం ఉన్నా.. కొండా మురళి తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి చైర్మన్‌ను కలసి కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎం.ఎస్‌. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్‌ కుమార్‌ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైపోయింది. ఇక కొండా మురళి రాజీనామాను శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆమోదించారు.

మరిన్ని వార్తలు