మోదీ ‘మురికి కాల్వ’ అంటూ.. కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలు

24 Jun, 2019 20:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ- నరేంద్రమోదీ మధ్య పోలిక తెస్తూ.. ‘ఎక్కడ గంగామాత.. ఎక్కడ మురికి కాల్వ’ (కహా మా గంగా.. కహా గందీనాలీ) అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మురికి కాల్వ అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అవమానిస్తారా అని విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లక్ష్యంగా అధిర్‌ రంజన్ చౌదరి విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. నాలి అనే పదాన్ని తన ప్రసంగంలో ఎక్కడా ఉపయోగించలేదన్నారు. తనకు హిందీ సరిగ్గా రాదని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ప్రధానికి ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణలు కోరుతున్నా అని తెలిపారు.

అసహనం నిండిన మీ నవభారతం మాకొద్దు!
ద్వేషం, అసహనం నిండిన మీ నవభారతం తమకొద్దని... మీ దగ్గరే పెట్టుకోండని కేంద్రానికి రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పెద్దలసభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని చెబుతున్న సబ్‌కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ ఎక్కడా కనిపించడంలేదని మండిపడ్డారు. జార్ఖండ్‌లో మైనార్టీ యువకుడిపై దాడి ఘటనను ప్రస్తావించిన అజాద్‌... మూకదాడులకు ఆ రాష్ట్రం ఫ్యాక్టరీలా మారిందని ఫైర్ అయ్యారు. ఇదేనా న్యూ ఇండియా అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ప్రేమసామరస్యాలతో కూడిన పాత భారతదేశాన్ని తిరిగివ్వమని  డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు