అక్రమాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది

10 Jun, 2018 20:44 IST|Sakshi

లోక్ సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే

సాక్షి, వరంగల్‌ : నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని లోక్‌సభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆదివారం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగిన దళితుల సింహగర్జనకు హాజరైన ఆయన మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోజుకు 6గురు మహిళలు అత్యాచారాలకు గురౌతున్నారని, 66 శాతం మంది ప్రజలు అన్యాయానికి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, మహిళలు, వృద్దులు ఇలా అందరూ దాడులకు గురౌతున్నారని ఆరోపించారు.

ఉద్యమాలు చేసే సమయం వచ్చిందని అన్నారు. బీజేపీ అక్రమాలు, అన్యాయాలపై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు గిరిజన మహిళలు, దళితుల ఇళ్లలో దాడులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి అల్లకల్లోలం సృష్టించారని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. కోర్టు వారి కుట్రలకు కళ్లెం వేసిందని పేర్కొన్నారు. వరంగల్‌ గడ్డ ఉద్యమాలకు వేదిక అని, ఇక్కడ నుంచి మరో ఉద్యమం మందకృష్ణ మాదిగ ద్వారా చూడబోతున్నామని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు