గ్రామాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా : పొన్నాల

8 Nov, 2018 20:36 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట జిల్లా : గ్రామాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్‌ చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన మాటకు కట్టుబడి ప్రతి పథకాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చేర్యాలలో మున్సిపల్‌ ట్యాక్స్‌ని వసూలు చేయడం కోసం షాపులకు తాళం వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌దంటూ ఎద్దేవా చేశారు. గ్రామాలను ఏ మేరకు అభివృద్ధి చేశారో చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్ధమా అంటూ పొన్నాల సవాల్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని పొన్నాల ఆరోపించారు. దానంపల్లి గ్రామ మహిళలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. నీళ్లిచ్చే ఓటు అడుగుతన్న కేసీఆర్‌ మాట తప్పి ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే చేర్యాలలో అభివృద్ధి జరిగిందన్నారు. నకసి కళలను ప్రోత్సాహించింది కాంగ్రెస్‌ పార్టీనే అని గుర్తుకు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచి మళ్లీ 9 రకాల నిత్యావసర వస్తువులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఏం చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామాల్లో ఓట్లు అడుగుతున్నారంటూ ‍ప్రశ్నించారు. కేసీఆర్‌ మీ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. ప్రజలు మీ నాయకుల్ని తరిమికొడుతున్నారంటూ పొన్నాల మండిపడ్డారు.

మరిన్ని వార్తలు