తెలంగాణలో రజాకార్ల పాలన 

18 Sep, 2018 13:16 IST|Sakshi
బైరాన్‌పల్లి బురుజు వద్ద నివాళులర్పిస్తున్న టీపీసీసీ మాజీ  అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

మద్దూరు(హుస్నాబాద్‌): పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెరాస ప్రభుత్వ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని బైరాన్‌పల్లిలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల బురుజు, స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను తెలంగాణ ప్రభుత్వ ఇప్పటి వరకు కొట్టివేయకపోవడం ఉద్యమకారులపై నిబద్దతకు నిదర్శనమని అన్నారు. మొదటి దశ ఉద్యమంలో విశాల ఆంధ్ర వద్దు తెలంగాణ ముద్దు అనే నినాదంతో నాడు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొన్నట్లు  తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు చేసిన సంతకాలలో తనదే మొదటి సంతకం అని తెలిపారు. మొదటి దశ  తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు. కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులు ఎందుకు గుర్తుకు రావడం లేదని నిలదీశారు. కొండగట్టు  బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్‌కు సమయం దొరకదని అన్నారు. కూటిగల్, బెక్కల, తోర్నాల  గ్రామాలలో పర్యటించి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శి గిరికొండల్‌ రెడ్డి, జడ్పీటీసీ సభ్యరాలు నాచగోని పద్మవెంకట్‌ గౌడ్, బొడికే ఎల్లస్వామి,మారేళ్ళ భాస్కర్‌ రెడ్డి, ఆరే సాయిలు, దాసరి పద్మారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు