కూటమికి ఓటమి లేదు: పొన్నం

25 Sep, 2018 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వారికి పాలన చేతకాదన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మాటలను కేసీఆర్‌ నిజం చేశారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. పాలనలో తామే బెస్ట్‌ అని నిరూపించామన్న కేసీఆర్‌ 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి కిరణ్‌కుమార్‌ మాటలను నిజం చేశారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కేటీఆర్‌ ముఖంలో మొదటిసారి ఓడిపోతామన్న భయం కనిపించిందన్నారు. అందుకే ఒక్క ఓటుతోనైనా గెలిపించానలి ప్రజలను కోరుతున్నారని ఎద్దేవా చేశారు.

సిరిసిల్లలో మరగుదొడ్ల నిర్మాణంలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. జిల్లాలోని ఏ వాగు చూసినా ఇసుక స్కామే కనిపిస్తుందని విమర్శించారు. ఏ గ్రామంలో కూడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ల నిర్మాణం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయంలో ఒకటో తేదిలోగా పెన్షన్లు ఇచ్చేవాళ్లమని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని దుయ్యబట్టారు. సోనియా గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. అపద్ధర్మ మంత్రులు ఎలా ప్లెక్సిలు వేసుకుంటారని నిలదీశారు. తమది ప్రజా కూటమి అని.. దానికి ఓటమి లేదన్నారు. తనకు ఎంపీగా పోటీ చేయడమే ఇష్టమని, కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తుందని పొన్నం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు