‘ప్రగతి నివేదన సభ కాదు పుత్రుడి నివేదిక సభ’

3 Sep, 2018 13:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కేసీఆర్‌ రక్తం చిందకుండా తెలంగాణ తెచ్చిన అంటున్నావ్‌.. నువ్వు పార్టీ పెట్టిన ఆరు ఏండ్లకు కేటీఆర్‌ అమెరికా నుంచి వచ్చాడు.. ‍ఆ తరువాత కవిత బతుకమ్మ అంటూ దిగింది.. కానీ తెలంగాణ కోసం 1200 మంది ఆత్మార్పణం చేసుకున్నారు.. మరి మీ ఇంటి నుంచి ఒక్కరైనా స్మశానానికి పోయారా’ అంటూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మీద నిప్పులు చెరిగారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిన్న జరిగింది ప్రగతి నివేదన సభ కాదని, పుత్రుడి నివేదిక సభ అని, తెలంగాణ ప్రజలపై జరిగిన దండయాత్రని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా లేదంటే మెత్త పెట్టి ఒత్తి  చంపాలా’ అంటూ కేటీఆర్‌ తండ్రిని బెదిరిస్తున్నాడని, అందుకే కొడుకును మభ్యపెట్టడానికి కేసీఆర్ ముందస్తని హడావుడి చేస్తున్నాడని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

సమైక్య పాలనలో తీసుకువచ్చిన పథకాలను కేసీఆర్‌ తనవిగా చెప్పుకుంటూ బీరాలు పోతున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ రాష్ట్రంలో, కేసీఆర్‌ చేసింది ఏం లేదని ఆయన విమర్శించారు.  పేదలు బతికున్నంత కాలం బర్లు, గొర్లు మేపుకుంటూ ఉంటే.. మీ కుటుంబం మాత్రం రాజ్యమేలుతూ ఉండలా అని  మండిపడ్డారు. సామాజిక న్యాయం అంటే కేసీఆర్‌ తన కుటుంబానికి మాత్రమే న్యాయం చేయడం అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి కోసం 1200 మంది ఆత్మార్పణం చేస్తే వారి వివరాలు సేకరించడానికి మీకు 51 నెలల సమయ​ కూడా సరిపోలేదా అని ప్రశ్నించారు. ఐఏఎస్‌ అధికారుల్ని కూడా చిన్న చూపు చూస్తున్నారని, దాంతో వారు ప్రభుత్వం మీద తిరుగుబావుటా ఎగురవేశారన్నారు. పౌర హక్కుల కోసం పోరాడే వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారంటే తెలంగాణలో ఎలాంటి పాలన సాగుతుందో అర్థమవుతోందంటూ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

‘గతంలో వార్తలు రాసి తరువాత పత్రిక అమ్మేవారు, కానీ ఇప్పుడు అమ్మిన తరువాత వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్‌ తనకు వ్యతిరేకంగా రాసే పత్రికలను లాక్కొని.. జర్నలిస్టులను రోడ్డు మీద పడేస్తున్నారని’ ఆరోపించారు. వెయ్యికోట్లతో ప్రగతి భవన్, బుల్లెట్ ఫ్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకున్న ముఖ్యమంత్రి.. అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మించడంలో ఎందుకు ముందడుగు వేయడం లేదంటూ ప్రశ్నించారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరు ఉంటేనే తట్టుకోలేని కేసీఆర్‌ హరికృష్ణకు స్మారక చిహ్నం కడతాను అన్నాడంటే ఓట్ల కోసం ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చన్నారు.

నిన్న జరిగిన సభలో కేటీఆర్, హరీష్ రావ్‌, కేసీఆర్, కవిత మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజలు కేసీఆర్‌ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అందుకే ఆయనలో ఇంతకు ముందున్న ఆత్మ విశ్వాసం, వాడి, వేడీ తగ్గాయని తెలిపారు.10వేల కోట్ల అంచనా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లకు పెంచిన కేసీఆర్.. ఇంటింటికి నల్లా కనేక్షన్‌ చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రేవంత్‌ రెడ్డి సవాలు చేశారు.

మరిన్ని వార్తలు