కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ జైలుకు

10 Jun, 2018 15:38 IST|Sakshi
ఇఫ్తార్‌ విందులో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ

మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు

శాసన మండలి కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌అలీ

ఆదిలాబాద్‌టౌన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, ఆక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు జైలుకు వెళ్ల డం ఖాయమని శాసన మండలి కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌అలీ జోస్యం చెప్పారు. శనివారం ఆదిలాబాద్‌ పట్టణంలోని భార్గవ్‌దేశ్‌ పాండే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం టీఎన్‌జీవోస్‌ సంఘ భవనంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల భారం పడుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రం లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించుకున్నాడని, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తానే నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వం వారి సమ్మెను నిర్వీర్యం చేయడం సరి కాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జీ భార్గవ్‌దేశ్‌పాండే, నాయకులు హరినాయక్, అనిల్‌జాదవ్, సాజిద్‌ఖాన్, జ్యోతి, మునిగెలనర్సింగ్, మంగేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు