పొత్తులతో బీసీలకు అన్యాయం చేస్తారా:వనమా

11 Nov, 2018 13:19 IST|Sakshi
కాంగ్రెస్‌ నేత వనమా వెంకటేశ్వర రావు

సాక్షి, హైదరాబాద్‌: పొత్తుల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్‌ అదిష్టానాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత వనమా వెంకటేశ్వరరావు పరోక్షంగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విలేకరులతో వనమా మాట్లాడుతూ..మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న తాను కూడా టికెట్‌ కోసం వేచి చూడాలా అని అడిగారు. కొత్తగూడెం టికెట్‌ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే టీఆర్‌ఎస్‌ను గెలిపించినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో లాలూచీ పడే గత ఎన్నికల్లో డిపాజిట్‌ రాక ఐదో స్థానం నిలిచిన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్‌ కోసం పట్టుబడుతున్నారని అన్నారు.

తనకు కొత్తగూడెం టికెట్‌ ఇస్తే 30 వేల మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిపిన సర్వేల్లో కూడా 80 శాతం తనకే గెలుపు అవకాశాలున్నాయని చెప్పారు. కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మంలలో ఒక సీటు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు పరిధిలో రెండు స్ధానాలు బీసీలకు ఇస్తామన్న కాంగ్రెస్‌ అధిష్టానం తన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.  తన లాంటి సీనియర్లకే టికెట్‌ వస్తుందా రాదా అన్న స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. టికెట్‌ రాకపోయినా కొత్తగూడెం ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు.
 

మరిన్ని వార్తలు