అనుమతి నిరాకరణపై కాంగ్రెస్‌ గుస్సా

12 Aug, 2018 02:04 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క. చిత్రంలో గీతారెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు

ఓయూలోకి రాహుల్‌ రాకను అడ్డుకోవడం నియంతృత్వం 

రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కుమారుడు వస్తే ఆటంకాలా? 

ఇప్పుడు ఆపగలిగినా.. భవిష్యత్తులో ఆపలేరని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాకుండా అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్బంధ, నియంత పాలనకిది నిదర్శనమని ధ్వజమెత్తారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాష్ట్రానికి వస్తుంటే ఆహ్వానించాల్సింది పోయి అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల సంగతేంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వర్సిటీలో రాజకీయ నాయకుల ప్రసంగాలను అనుమతించవద్దన్న ఓయూ ఉన్నతస్థాయి నిర్ణయాన్ని రాహుల్‌ విషయంలో అమలుపై తప్పుపట్టారు. శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, పీఏసీ చైర్‌పర్సన్‌ గీతారెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.  

ఇనుప కంచెలు దాటుకొని వెళతాం 
రాహుల్‌ను ఓయూలోకి అనుమతించకపోవడం శోచమనీయం. విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్‌ రావాలని భావించారు. ఓయూ నిషేధిత ప్రాంతం కాదు. ఇప్పుడు ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం తమను అడ్డుకోలేరు. పోలీస్‌ బలగాలను, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లి విద్యార్థులను కలుస్తాం. 
     –భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 

బీజేపీ బీ–టీమ్‌ టీఆర్‌ఎస్‌ 
బీజేపీకి టీఆర్‌ఎస్‌ బీ–టీమ్‌గా పనిచేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. చైతన్య, నారాయణ కాలేజీల్లో టీఆర్‌ఎస్‌ నేతలు వాటాలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నీళ్లడిగితే, రైతులను ప్రభుత్వం నిర్బంధిస్తోంది. రాహుల్‌ పర్యటనను అడ్డుకునే కుట్ర చేస్తోంది. 
    –మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి  

రాహుల్‌కు భయపడే..  
రాహుల్‌కు భయపడే ఓయూ పర్యటనను సీఎం కేసీఆర్‌ అడ్డుకున్నరు. కేసీఆర్‌ ఇప్పటికైనా మనసు మార్చుకుని రాహుల్‌ ఓయూ పర్యటనకు అనుమతివ్వాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో విద్యార్థులే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. ఎన్నికలు డిసెంబర్‌లో వచ్చినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే. 
    –గీతారెడ్డి, పీఏసీ చైర్‌పర్సన్‌ 

తెలంగాణలో నియంత పాలన  
అతిథిని గౌరవించడం తెలంగాణ సంస్కృతి. కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు వస్తుంటే అవమానిస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోంది. ఓయూలో కనీసం అడుగుపెట్టే దమ్ములేని కేసీఆర్‌ రాహుల్‌ పర్యటనను అడ్డుకోవడం శోచనీయం. తెలంగాణ కేసీఆర్‌ జాగీరుకాదు. 
    –వి.హనుమంతరావు, మాజీ ఎంపీ 

ఇది ప్రజాస్వామ్యమా?  
ఉస్మానియా వర్సిటీలో రాహుల్‌గాంధీ సభకు అనుమతినివ్వకపోవడం కేసీఆర్‌ మార్కు ప్రజాస్వామ్యమా? రాహుల్‌ చొరవతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఆయనకిచ్చే గౌరవం ఇదేనా? రాహుల్‌ పర్యటన అంటే కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు.  
    –పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత

మరిన్ని వార్తలు