గులాబీలకు కాంగ్రెస్‌ వల

18 Oct, 2018 02:05 IST|Sakshi

ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్టీ మారుతున్నారని ప్రచారం

మరో ఇద్దరు మంత్రులు, వారి బంధువులకు సీట్ల డిమాండ్లపై చర్చ

రాజేంద్రనగర్‌ టికెట్‌ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ప్రయత్నం!

రాహుల్‌ పర్యటన తర్వాత భారీ వలసలున్నాయని కాంగ్రెస్‌ ప్రచారం

మావాళ్లెవరూ పార్టీ మారరు.. ఇది కాంగ్రెస్‌ మైండ్‌గేమ్‌: టీఆర్‌ఎస్‌  

సాక్షి, హైదరాబాద్‌: టికెట్లు ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ అసంతృప్తవాదులకు కాంగ్రెస్‌ పార్టీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే.. సొంత పార్టీలోని ప్రత్యర్థులను మట్టికరిపించాలని భావిస్తున్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్‌ జాబితాలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 20న రాహుల్‌ గాంధీ పర్యటన తర్వాత వీరంతా పార్టీలో చేరే అవకాశం పుష్కలంగా ఉందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డే ‘సాక్షి’ ప్రతినిధితో వెల్లడించారు.  ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కలిసి.. టీఆర్‌ఎస్‌ అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ చాలా మంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ.. పెద్ద తలకాయలను చేర్చుకునేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీపీసీసీ వర్గాలు చెప్పాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్‌ ఆడుతున్న మైండ్‌గేమని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడొకరు తేలిగ్గా తీసిపారేశారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే.. కాంగ్రెస్‌ ఇలాంటి నక్కజిత్తులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. 

కేసీఆర్‌ వద్దనుకున్నందుకే.. 
ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఈసారి శాసనసభకు పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే, కేసీఆర్‌ ఒకేసారి ప్రకటించిన 105 నియోజకవర్గాల అభ్యర్థుల్లో.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి తాజా మాజీ ఎమ్మెల్యే పేరు ప్రకటించడంతో ఆయనతోపాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయకపోతే.. ఆ నియోజకవర్గంపై పట్టు కోల్పోతానన్న భావనలో సదరు మంత్రి ఉన్నారు. దీనిని అదనుగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ మంత్రితో రాయబారం నెరిపింది. తాను కోరుకున్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామన్న సందేశం పంపింది. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరో చోట నుంచి టిక్కెట్‌ ఇవ్వాలని ఆయన షరతు పెట్టినట్లు తెలిసింది. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కొత్తగా పార్టీలో చేరేవారి వివరాలు, వారు పెడుతున్న డిమాండ్లను పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మరో మంత్రి తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కావాలని గట్టిగా అడుగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. అయితే సదరు మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు టిక్కెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ రాకపోతే ఆలోచిస్తానని ఆయన చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 


 
మంత్రిని ఓడించాలన్న కసితో ఎంపీ 
దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన లోక్‌సభ సభ్యుడొకరు ప్రస్తుత మంత్రి ఒకరిని ఓడించాలన్న కసితో ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీలో చేరి పోటీ చేసి అయినా అనుకున్నది సాధించాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పారని తెలుసుకున్న కాంగ్రెస్‌ ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ఆ ఎంపీ తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మరో ఎంపీ కూడా శాసనసభకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయనకు కూడా కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజవకర్గం నుంచి పోటీ చేయాలన్న భావనలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ఎమ్మెల్సీకి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే.. ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్సీ కొట్టిపారేయగా, ఆయన సీటు కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్‌ అంటోంది. 

మరిన్ని వార్తలు