కాంగ్రెస్‌ కష్టం.. టీఆర్‌ఎస్‌ ప్రచారం!

27 Nov, 2017 01:37 IST|Sakshi
పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తున్న ఉత్తమ్‌

మెట్రోను అడ్డుకున్న కేసీఆరే గొప్పలు చెప్పుకుంటున్నారు

కేసీఆర్‌ అవకాశవాదానికి ప్రజలు బలి: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

చార్జీలపై ఎల్‌ అండ్‌ టీతో కేసీఆర్‌ కుమ్మక్కు: శ్రవణ్‌ 

మెట్రో ప్రాజెక్టుపై పీసీసీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: పెరుగుతున్న జనాభా అవసరాల కోసం హైదరాబాద్‌లో మెట్రో పనులను కాంగ్రెస్‌ హయాంలోనే మొదలు పెట్టామని, అప్పుడు అడ్డుపడిన కేసీఆర్‌ ఇప్పుడు తన గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఇందిరాభవన్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలుకు సంబంధించిన సమగ్ర వివరాలతో పీసీసీ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ, మెట్రో రైలుకు సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రజలకు గుర్తు చేయడానికే ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మెట్రో రైలు మంజూరు, డిజైన్, నిధుల సేకరణ వంటివన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగితే, పనులకు శంకుస్థాపన కిరణ్‌కుమార్‌రెడ్డి చేశారని వివరించారు. మెట్రో రైలు ఎవరి కోసం అంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారని గుర్తుచేశారు. మెట్రోను వ్యతిరేకిస్తూ, అలైన్‌మెంటు మార్పు కావాలంటూ రాసిన లేఖలను, మాట్లాడిన వీడియోలను ఉత్తమ్‌ మీడియాకు ప్రదర్శించారు. అప్పుడు అడ్డుకున్న కేసీఆర్‌.. ముఖ్యమంత్రి కాగానే అలైన్‌మెంటులో ఎలాంటి మార్పులూ చేయలేదన్నారు. 

కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే: ఉత్తమ్‌
మూడేళ్ల క్రితమే మొదటి దశ మెట్రో పనులు చాలా వరకు పూర్తయ్యాయని, కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కారణంతోనే ప్రారంభించకుండా ఇప్పటిదాకా వాయిదా వేసుకుంటూ వచ్చారని ఉత్తమ్‌ ఆరోపించారు. మెట్రో రైలు పనులను, పరిస్థితిని కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు పరిశీలిస్తామంటే ప్రభుత్వం అంగీకరించడంలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో వంటివన్నీ కాంగ్రెస్‌ ఘనతలేనన్నారు. అలైన్‌మెంటు మార్పు అంటూ కమీషన్ల కోసం పనులను ఆపడం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.4 వేల కోట్ల భారం పడిందని, దీనికి కేసీఆర్‌ ప్రత్యక్ష బాధ్యులని విమర్శించారు. మెట్రోలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా తీవ్రంగా అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ మూర్ఖత్వానికి, అవకాశవాదానికి ప్రజలు బలి అవుతున్నారని విమర్శించారు. మెట్రో రైలు చార్జీలు పెంచడానికి ఆలస్యమే కారణమన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పూర్తయిన పైపులైన్ల నుంచి వచ్చిన నీటిని ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభించి, మిషన్‌ భగీరథ పేరుతో ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు.  

బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు అడ్డుకున్నారు: శ్రవణ్‌ 
పీసీసీ ముఖ్య అ«ధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ.. మెట్రో భవన్‌కు 2007లోనే శంకుస్థాపన జరిగిందని, మెట్రో ఒప్పందం 2010లో జరిగిందని, 5 ఏళ్లలో పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఆ ప్రకారం 2015లోనే పూర్తయ్యేదని, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కేసీఆర్, అలైన్‌మెంటు మార్పు అంటూ, చారిత్రక కట్టడాలు అంటూ కేటీఆర్, కవిత అడ్డుకున్నారని శ్రవణ్‌ ఆరోపించారు. మెట్రోకు భూములివ్వకుండా కేసీఆర్‌ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ధరల విషయంలో ఎల్‌ అండ్‌ టీతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రారంభ ధర రూ.8, 19 కిలోమీటర్లకు రూ.19గా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ధరలను నిర్ణయించిందని వివరించారు. 

మరిన్ని వార్తలు