టీడీపీతో పొత్తు.. ఏపీ కాంగ్రెస్‌ నేతల స్పందన!

15 Aug, 2018 13:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం జతకట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ఖండించకుండా.. వాస్తవమేనన్నట్లుగా ఏపీ కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారు. బుధవారం ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై అధిష్టానందే తుదినిర్ణయమన్నారు. ఈ విషయంలో రాహుల్‌ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ దుష్ట పరిపాలన నుంచి ప్రజలను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీనికి అనుగుణంగానే రాహుల్‌ నిర్ణయం ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో సంకీర్ణయుగం నడుస్తోందన్నారు.

అవినీతి ఎమ్మెల్యేలకు టీడీపీ సీట్లు ఇవ్వోద్దని కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని టీడీపీ పొత్తును పరోక్షంగా ప్రస్తావించారు.

>
మరిన్ని వార్తలు