మద్యం తాగలేదు.. చైర్మన్‌కు గాయం కాలేదు!

12 Mar, 2018 17:54 IST|Sakshi

ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడినట్టు అయింది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో గవర్నర్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెడ్‌ఫోన్‌ విసిరేయడం.. అదికాస్తా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలి కంటికి స్వల్పగాయం కావడం.. తీవ్ర దుమారం రేపింది.

అయితే, ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలు తమ సభ్యులపై వచ్చిన ఆరోపణలను, అధికార పార్టీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. శాసనసభలో ప్రతిపక్ష నేత, పీసీసీ సీనియర్‌ నేత జానారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. కాంగ్రెస్‌ సభ్యులెవరూ మద్యం తాగి.. అసెంబ్లీకి రాలేదని, మద్యం తాగి సభకు వచ్చారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఖండించారు. సభలో తమ ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్‌ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, తాము ప్రజాస్వామికంగానే సభలో నిరసన తెలిపామని ఆయన చెప్పారు.

మరో సీనియర్‌ నేత, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సభలో అసలు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు గాయమే కాలేదని అన్నారు. ఆయన బయటకు రాగానే గాయమైనట్టు చెప్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో టీఆర్‌ఎస్‌ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసునని అన్నారు. కనీసం పోడియం వద్దకు ప్రతిపక్ష సభ్యులను అనుమతించకపోవడం దారుణమని అన్నారు. స్పీకర్‌ వద్ద ఉండాల్సిన మార్షల్స్‌ తమ వద్దకు ఎందుకు వచ్చారని భట్టి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు