మైక్‌ కట్‌ చేస్తే రోడ్ల మీదకే..

8 Sep, 2019 03:53 IST|Sakshi

రోడ్లు, తాగు, సాగు నీరు,నిరుద్యోగం, యూరియాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం 

కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, తాగు, సాగు నీరు, నిరుద్యోగం, యూరియా కొరత, రైతుబంధు, విష జ్వరాలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. బడ్జెట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహం తదితరాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇక్కడి గోల్కొండ హోటల్‌లో సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, వీరయ్య, సీతక్కలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జెట్టి కుసుమకుమార్‌ తదితరులు హాజరయ్యారు.

రైతుబంధు సైతం అందలేదని, రుణమాఫీ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అంశంపై చర్చించిన నేతలు దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి కోరినంత సమయం ఇవ్వకున్నా, మైక్‌ కట్‌ చేసి తమగొంతు నొక్కాలని ప్రయత్నించినా రోడ్లెక్కి ఆందోళన కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం స్పందించిన తీరు బాగాలేదని, రైతుల మరణాన్ని కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించిందనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. భేటీ అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సంగారెడ్డి తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 15న చలో అసెంబ్లీ నిర్వహిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు