కేసీఆర్‌కు ‘లాక్‌డౌన్‌’ వర్తించదా?

3 Jun, 2020 05:14 IST|Sakshi

10 వేల మందితో సీఎం ప్రాజెక్టులు సందర్శించారు

ఆయనకు లేని నిబంధన మాకెలా అడ్డంకి అయింది?

మా అరెస్టులపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: ఉత్తమ్‌

ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు

4న మంజీరా, 6న గోదావరి ప్రాజెక్టుల సందర్శన చేపడతాం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా 10 వేల మందితో సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో తిరిగారని, ఆయనకు లేని కరోనా నిబంధన తమకు అడ్డంకి ఎలా అయిందని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిలతో కలసి ఉత్తమ్‌ మాట్లాడారు.

ఇద్దరు ఎంపీలు, మాజీ హోంమంత్రినే పోలీసులు అడ్డుకుంటే ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటన్నారు. దీనిపై అడిగేందుకు డీజీపీని ఫోన్లో ప్రయత్నించినా సమాధానం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు పూర్తయినా 2014కన్నా ముందు చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. 2018 మార్చి నుంచి 2020 జూన్‌ వరకు ఎస్‌ఎల్‌బీసీ పనులు ఎందుకు ఆగిపోయాయని నిలదీశారు. ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సీఎం కేసీఆర్‌ వెనకాడుతున్నారని... నల్లగొండ ప్రాంతంపై సవతితల్లి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. ఎన్ని నిర్బంధాలను ఎదుర్కొని అయినా పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తీరుతామన్నారు. అందులో భాగంగా ఈ నెల 4న మంజీరా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, 6న గోదావరి నదిపై ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తామని స్పష్టం చేశారు.

పెండింగ్‌ ప్రాజెక్టులపై కేసీఆర్‌ నిర్లక్ష్యం: కోమటిరెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కోసం రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే పూర్తయ్యేదని, కానీ సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం కారణంగానే నిలిచిపోయిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తమకు పేరు వస్తుందనే దుగ్ధతోనే పూర్తి చేయడం లేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల్లో 10 శాతం పనులు కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. లక్ష ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులకు కూడా కనీసం రూ. 100 కోట్లు ఇవ్వకుండా కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. డిండి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాళేశ్వరం ఎలా పూర్తవుతుందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. ప్రశ్నించే వారిని నిర్బంధిస్తున్న సీఎం కేసీఆర్‌... అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

నిర్బంధాలకు దిగడం దారుణం: జానారెడ్డి
స్వరాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని మాజీ హోంమంత్రి కె. జానారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా తాము సహకరించామని, కానీ అధికార పార్టీ మాత్రం నిర్బంధాలకు దిగడం దారుణమన్నారు. ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిర్మాణం పూర్తి చేయలేదని, 80–90 శాతం పనులు జరిగిన ప్రాజెక్టులనూ పూర్తి చేయలేకపోయిందన్నారు. నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్‌ ఏం చేశారో సమాధానం చెప్పాలని జానా డిమాండ్‌ చేశారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని చరిత్ర రుజువు చేస్తోందని, తెలంగాణలో అది టీఆర్‌ఎస్సే అవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు