మాటల దాడి.. మరింతగా!

26 Nov, 2018 03:48 IST|Sakshi

     రోజుకో ఏఐసీసీ కీలకనేతతో టీఆర్‌ఎస్‌పై ఆరోపణాస్త్రాలు 

     కేసీఆర్‌ విమర్శల నేపథ్యంలో ప్రతిగా మాటలయుద్ధానికి దిగిన కాంగ్రెస్‌ నేతలు  

     నేడు రాష్ట్రానికి జైరాం రమేశ్,వీరప్పమొయిలీ, రాజీవ్‌ గౌడ

సాక్షి, హైదరాబాద్‌: విమర్శకు ప్రతివిమర్శ.. మాటకు మాట.. ఆరోపణకు ప్రత్యారోపణ.. వేడివేడిగా సాగుతోంది ఎన్నికల ప్రచారపర్వం. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పోలింగ్‌(డిసెంబర్‌ 7న) గడువు సమీపిస్తున్న కొద్దీ మాటలదాడి ఎక్కువవుతోంది. టీఆర్‌ఎస్‌ విమర్శలపై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తోంది. రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నేతలు జిల్లా, నియోజకవర్గ పర్యటనల్లో ప్రభుత్వతీరును తూర్పారబడుతుండగా, ఢిల్లీ నుంచి వస్తున్న ఏఐసీసీ ముఖ్యనేతలు కేసీఆర్, ఆయన కుటుంబంపై మాటలదాడిని పెంచారు. తెలంగాణ ఎన్నికల సమయం మొదలైన నాటి నుంచే టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు కాంగ్రెస్‌ తీరును ఎండగడుతూ వస్తున్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌నేతలు ఎప్పటికప్పుడూ స్పందిస్తూ వస్తున్నారు.

ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్‌ జతకట్టడంతో టీఆర్‌ఎస్‌ విమర్శలను తీవ్రతరం చేసింది. నదీజలాల అంశం లో చంద్రబాబుతీరును అన్ని బహిరంగసభల్లో ప్రశ్నిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, సీతా రామ ఎత్తిపోతల పథకాలపై చంద్రబాబు కేంద్రానికి చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నాకే ఇక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు, భూకుంభకోణాల గురించి కేసీఆర్‌ బహిరంగసభల్లో ప్రస్తావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్‌ నేతలు తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తాలేక, చంద్రబాబును భుజాల మీద మోస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. కేసీఆర్‌ విమర్శల పరంపరను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌పెద్దలు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా రోజుకొక ఏఐసీసీ అధికార ప్రతినిధి, సీనియర్‌నేత రంగంలోకి దిగి పదునైన మాటలతో ప్రతి విమర్శలు చేస్తున్నారు. 

నేటి నుంచి మరికొందరు... 
మరో ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవగౌడ సోమవారం హైదరాబాద్‌ వస్తున్నారు. ఈయనతోపాటు కేంద్ర మాజీమంత్రి, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జైరాంరమేశ్‌ సోమవారం నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మరో మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబమే లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలు గుప్పించేందుకే వీరందరినీ రంగంలోకి దించినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు డిసెంబర్‌ 5 వ తేదీ వరకు మరికొందరు ముఖ్య నాయకులు కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగనున్నారని వ్యాఖ్యానిస్తున్నాయి.

గట్టిగా బదులిస్తున్న ఢిల్లీ నేతలు..
కొద్దిరోజుల కిందట ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ వరుసగా మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని, కేసీఆర్‌ ప్రధాని మోదీ ముసుగు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం సైతం కేసీఆర్, ఆయన పాలనను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. రెండ్రోజుల కింద మరో ముఖ్య అధికారప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా టీఆర్‌ఎస్‌ ప్రజాకంటక పాలనపై చార్జిషీట్‌ విడుదల చేశారు. 24 అంశాల్లో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపే యత్నం చేశారు. ప్రాజెక్టులు, అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల టెండర్లలో అక్రమాలు జరిగాయని, తాము అధికారంలోకి రాగానే దోషులను కటకటాల వెనక్కి పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఆదివారం మరో అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వీ  మరో అడుగు ముందు కేసి ‘కేసీఆర్‌ అధికారం కోల్పోయాక ఫాంహౌస్‌లో పడుకుంటానని అనుకుంటున్నారేమో. కానీ, మేం అతన్ని సుఖంగా నిద్రపోనివ్వం. ఆరోపణలున్న అన్ని అంశాలపై విచారణ చేసి అవినీతి సొమ్మునంతా కక్కిస్తాం’అంటూ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపైనా పలు ప్రశ్నలు సంధించారు.

మరిన్ని వార్తలు