వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు

7 Apr, 2018 01:40 IST|Sakshi
శుక్రవారం వరంగల్‌ జిల్లా పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. చిత్రంలో పార్టీ నేతలు

లేదంటే శాశ్వతంగా రాజకీయాలకు దూరం: ఉత్తమ్‌ 

80 స్థానాల్లో విజయం సాధిస్తాం 

కేసీఆర్‌ కుటుంబానిది నిజాంను మించిన విలాసం 

బీసీ రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్‌పై మౌనమెందుకు? 

త్వరలో కాంగ్రెస్‌ మీడియా వస్తుంది 

కేటీఆర్‌.. మీ తండ్రితో సవాల్‌ చేయించు: రేవంత్‌ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ఆత్మకూరు: వచ్చే ఎన్నికల్లో 80 సీట్లలో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్, పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. మీడియా ఎదుట బదులు చెబుతున్నా. కాంగ్రెస్‌... టీఆర్‌ఎస్‌ మాదిరి కుటుంబ పార్టీ కాదు ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటించడానికి. అయినా చెబుతున్నా. రాబోయే సాధారణ ఎన్నికల్లో 80 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి రాకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా’’అని స్పష్టంచేశారు.

బయటకు బంగారు తెలంగాణ అని చెబుతూ లోపల బంగారు కుటుంబం నిర్మించుకుంటున్నారని సీఎంను విమర్శించారు. రాష్ట్రంలో అహంకారం, అసహనంతో నిర్మించిన పోలీస్‌ రాజ్యంలో నలుగురి పాలన నడుస్తోందంటూ దుయ్యబట్టారు. మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులో ఆరు శాతం కమీషన్‌ సీఎం కుటుంబం తీసుకుంటున్నది నిజమో కాదో చెప్పాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావులు నేలపై నడవడం లేదని, అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. నిజాం సైతం ఇలాంటి జీవితం గడపలేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌పై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ముస్లింల మాదిరి బీసీ ఏ నుంచి డీ వరకు రిజర్వేషన్ల శాతంపై పెంచాలంటే సమాధానం ఇవ్వడం లేదని ఉత్తమ్‌ పేర్కొన్నారు. సర్కారు తప్పులు ఎత్తి చూపుతామని భయపడే సీఎం.. స్పీకర్‌ మధుసూదనాచారితో కుట్రపన్ని తమను అసెంబ్లీ నుంచి బయటకు పంపారన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, మిర్చి, పసుపు, పత్తి పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. 

త్వరలో కాంగ్రెస్‌ మీడియా 
మీడియాలో తాము మాట్లాడే నిజాలు చిన్నగా.. కేసీఆర్‌ మాట్లాడే అబద్ధాలు పెద్దగా వస్తున్నాయని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. రాబోయే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్‌కు సొంత మీడియా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో పార్టీ పరంగా గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల బూత్‌ కమిటీలను నియమించాలని నేతలకు సూచించారు. బూత్‌స్థాయిలో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని, పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు. కాంగ్రెస్‌ మూల సిద్ధాంతంలోనే సామాజిక న్యాయం ఉందని, పార్టీ కోసం కష్టపడి పని చేసే వాళ్లందరికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేసి  కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలన్నారు. 

కేటీఆర్‌ మాటల్ని కేసీఆరే నమ్మడం లేదు: రేవంత్‌ 
మంత్రి కేటీఆర్‌ మాటలను ఆయన తండ్రే నమ్మడం లేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ విసిరిన రాజకీయ సవాల్‌ను సీఎం కేసీఆర్‌తో చెప్పిస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించిన 12,000 కోట్లలో రూ.4 వేల కోట్లను గ్రామాల్లోని పార్టీ కార్యకర్తల ఖాతాల్లో వేసేందుకు పన్నాగం వేశారన్నారు. 

కాంగ్రెస్‌ లేకుండా ఫ్రంట్‌ లేదు: వీహెచ్‌ 
కాంగ్రెస్‌ పార్టీ లేకుండా దేశంలో ఏ ఫ్రంట్‌ ఏర్పడలేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్‌ తన కొడుకును సీఎం చేయడానికే థర్డ్‌ ఫ్రంట్‌ను ఎత్తుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పక్క రాష్ట్రం పోరాడుతుంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. 

గజ్వేల్‌లో పోటీకి సిద్ధమా: సర్వే 
ఉత్తమ్‌ అమాయకుడని, కేసీఆర్‌ తరహాలో తిమ్మిని బమ్మి చేయలేని ఉత్తముడని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 101 సీట్లలో గెలుస్తామని సర్వే రిపోర్టులు వచ్చినా కేవలం 80 అనే చెబుతున్నాడని పేర్కొన్నారు. ఉత్తమ్‌కు బచ్చా అయిన కేటీఆర్‌తో సవాల్‌ ఏంటీ, దమ్ముంటే కేసీఆర్‌ సవాల్‌కు రావాలన్నారు. గజ్వేల్‌లో సీఎం రాజీనామా చేస్తే అక్కడ్నుంచి ఉత్తమ్‌ పోటీ చేసి, భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గీతారెడ్డి, సంపత్‌కుమార్, షబ్బీర్‌ అలీ, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్, మల్లురవి, నంది ఎల్లయ్య, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నేటి యాత్ర రద్దు 
ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఐత సత్యం మృతి కారణంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించాల్సిన ప్రజా చైతన్య యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్‌ 8న జరగాల్సిన డోర్నకల్, మహబూబాబాద్‌ నియోజకవర్గాల బస్సుయాత్ర యథావిధిగా కొనసాగుతుందన్నారు.  

మరిన్ని వార్తలు