250 అని అమిత్‌ షా ఎలా చెబుతున్నారు?

5 Mar, 2019 03:04 IST|Sakshi

‘బాలాకోట్‌’పై విపక్షాల ఎదురుదాడి

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికారిక ప్రకటన లేకపోవడం పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారన్న విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా దేని ఆధారంగా చెబుతున్నారని కాంగ్రెస్‌ సోమవారం ప్రశ్నించింది. వైమానిక దాడులను మోదీ, బీజేపీ రాజకీయం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకుంటున్నాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆర్‌పీఎన్‌ సింగ్‌ ఆరోపించారు.

రఫేల్‌ లేకుండా వాయుసేన బలహీనంగా ఉందన్న వ్యాఖ్యలను చేయడం ద్వారా మోదీ వాయుసేనను అవమానించారనీ, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఆయన ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదనీ, అమిత్‌ షా మాత్రం ఆ సంఖ్య 250 అని ఎలా చెబుతున్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. దాడిలో 250 మంది చనిపోయారని ఏ ఆధారాలూ చూపకుండానే అమిత్‌ షా చెబుతుండటాన్ని బట్టే విషయాన్ని ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతోందని సిబల్‌ అన్నారు.

సైన్యాన్ని అవమానించకండి: బీజేపీ
వైమానిక దాడులపై బూటకపు, కట్టుకథలతో దేశాన్ని తప్పుదారి పట్టించవద్దనీ, సైన్యాన్ని అవమానించవద్దని కాంగ్రెస్‌కు సోమవారం బీజేపీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదులు, వారి మద్దతుదారులపై దాడులు జరుగుతోంటే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఇబ్బందిగా ఉన్నట్లుంది. ఇది యాధృచ్చికమా, భాగస్వామ్యమా? సైన్యం పరాక్రమానికి సెల్యూట్‌ చేస్తూ దేశం మొత్తం ఒకే మాట మాట్లాడుతున్న సమయంలో, విపక్షాలు ఇలాంటి ప్రశ్నలను వేయడం దురదృష్టకరం’ అని అన్నారు. విపక్షాలది బాధ్యతారాహిత్యమనీ, ఉగ్రవాదులపై భద్రతా దళాలు తీసుకునే చర్యలను ఆ పార్టీలు స్వాగతిస్తాయన్న నమ్మకం పోయిందని నఖ్వీ పేర్కొన్నారు.

రఫేల్‌ను ఎందుకు తీసుకోలేదు?
దాదాపు ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఒక్క రఫేల్‌ విమానాన్ని కూడా వాయుసేనలో ఎందుకు ప్రవేశపెట్టలేదనీ, ఇన్నాళ్లూ ఏం చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి మోదీని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌ షాలు భద్రతా దళాలను రాజకీయ విన్యాసాల కోసం వినియోగించుకుంటున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. దాడిలో చనిపోయిన ముష్కరుల సంఖ్యపై సైన్యం అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, ఆ దాడుల్లో 250 మంది చనిపోయారని అమిత్‌ షా అంటున్నారనీ, తద్వారా సైన్యం అబద్ధం చెబుతోందని అమిత్‌ షా ఉద్దేశమా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.

మరిన్ని వార్తలు