కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత సంస్థా?

1 Jan, 2020 02:37 IST|Sakshi
గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్, ఇతర కాంగ్రెస్‌ నేతలు

పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలనూ అరెస్టు చేశారు

రాష్ట్రంలో నిరసనలకు పిలుపునివ్వగానే హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌పై విచారణ జరిపించండి

మీ విచక్షణాధికారంతో శాంతిభద్రతల విషయంలో చొరవ తీసుకోండి

గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ బృందం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను టీపీసీసీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లు ఈ బృందంలో ఉన్నారు. దాదాపు అరగంటపాటు గవర్నర్‌తో భేటీ అయిన కాంగ్రెస్‌ నేతలు ఈనెల 28న కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగిన ఘటన గురించి వివరించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ కోసం తాము పోలీసులను అనుమతి కోరితే అకారణంగా తిరస్కరించారని వివరించారు.

పోలీసులు చెప్పిన రూట్లో వెళ్తామని, అవసరమైతే ఎలాంటి నినాదాలు చేయకుండా మౌనంగా వెళ్తామని చెప్పినా పోలీసులు అనుమతివ్వలేదని చెప్పారు. దీనికి తోడు తమ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కార్యకర్తలను కూడా అరెస్టు చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నిషేధిత, చట్ట వ్యతిరేక సంస్థ ఏమీ కాదని చెప్పారు. ఇదేమని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను అడిగితే దురుసుగా జవాబిచ్చారని, ఆయన వ్యవహారశైలి, పనితీరుపై చాలా ఆరోపణలున్నాయని, వెంటనే ఆయనపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి తోడు రాష్ట్రంలో ప్రజల హక్కులను అణచివేస్తున్నారని, కనీసం నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు నిరసనలకు పిలుపునివ్వగానే నాయకులను గృహ నిర్బంధం చేసి, నిరసనలు కూడా తెలపకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014లోని సెక్షన్‌ 8 ప్రకారం తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి హైదరాబాద్‌లో శాంతిభద్రతల అమలుపై చొరవ తీసుకోవాలని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో టీపీసీసీ నేతలు కోరారు.  

పోలీసులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు: ఉత్తమ్‌
రాష్ట్రంలో పోలీసులు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం టీపీసీసీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌ ఎదుట విలేకరులతో మాట్లాడుతూ, ఎల్బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి, దారుస్సలాంలో ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పైగా తమ పార్టీ కార్యాలయానికి వస్తున్న కార్యకర్తలను అరెస్టులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్ర కేడర్‌కు కేటాయించినా వెళ్లకుండా, తెలంగాణలో ఉన్నత పదవిలో ఉన్న హైదరాబాద్‌ సీపీ వ్యవహారశైలిపై విచారణ జరిపించాలని, తనకున్న విచక్షణాధికారాలతో శాంతిభద్రతల విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు ఉత్తమ్‌ చెప్పారు.   

నేనున్నది అందుకే కదా: గవర్నర్‌  
గవర్నర్‌తో సమావేశం సందర్భంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, గవర్నర్‌గా తమిళిసై పనితీరుకు కితాబిచ్చారు. గతంలోకన్నా గవర్నర్‌ పాత్ర బహిరంగంగా కనిపిస్తోందని, అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారని, ప్రజల వినతులపై కూడా స్పందిస్తున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన గవర్నర్‌ తన బాధ్యత ప్రకారం వ్యవహరిస్తున్నానని, తానున్నది అందుకేనని, అందుకే వెంటనే ఆయా శాఖలకు వినతిపత్రాలు పంపించి వేస్తున్నానని కాంగ్రెస్‌ నేతలకు చెప్పినట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు