రాహుల్‌ ఇంటి ముందు కార్తీక ధర్నా

15 Nov, 2018 19:56 IST|Sakshi

హామీ మేరకు సికింద్రాబాద్‌ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్‌

అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు..  

సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఇచ్చిన హామీ మేరకు సికిం ద్రాబాద్‌ ఎమ్మెల్యే టికెట్‌ తనకే ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇంటి ముందు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీలోని రాహుల్‌ నివాసం వద్ద సుమారు 5 గంటలపాటు ఆమె భర్త చంద్రారెడ్డితో కలసి బైఠాయించారు.

పార్టీ కోసం తాను, తన భర్త ఎంతో సేవ చేశామని, మేయర్‌గా పనిచేసిన తనను కాదని.. సికింద్రాబాద్‌ టికెట్‌ను స్థానికేతరులకు ఎలా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా తనకు ఫోన్‌ చేసి సికింద్రాబాద్‌ సీటును వేరే నియోజకవర్గానికి చెందిన బీసీకి ఇస్తున్నట్టు చెప్పారన్నారు. సికిం ద్రాబాద్‌లో కాంగ్రెస్‌ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన తనను కాదని ఇప్పుడు ఇతరులకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఒక మహిళకు ఇంత అన్యాయమా..
‘2014లోనే నేను టికెట్‌ ఆశించినా అప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న జయసుధకు టికెట్‌ ఇస్తే ఆమెకు మద్దతు ఇచ్చాం. ఇప్పుడు కచ్చితంగా సీటు మాకే ఇవ్వాలని కోరుతున్నాం. జీహెచ్‌ఎంసీలోని 24 నియోజకవర్గాల్లో ఒక మేయర్‌గా నేను ఎన్నో పనులు చేశాను. నా భర్త కూడా 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు బయటి నుంచి వేరెవరినో తీసుకొచ్చి సీటెలా ఇస్తారు. ఒక మహిళకు కాంగ్రెస్‌లో ఇం త అన్యాయం చేస్తూ ఏం సందేశం ఇవ్వాలనుకుంటు న్నారో పార్టీ పెద్దలే చెప్పాలి.

సికింద్రాబాద్‌ సీటు నాకే ఇస్తామని రాహుల్‌ గతంలోనే హామీనిచ్చారు. ఇతర పార్టీల నుంచి మాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్‌ని వీడలేదు. ఇప్పుడు నాకు టికెట్‌ ఎందుకు నిరాకరించారో పార్టీ పెద్దలే వివరించాలి’ అని కార్తీక డిమాండ్‌ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో కార్తీక, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని తుగ్లక్‌ రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు