‘జనాలు తిరగబడి తన్నే రోజు వస్తుంది’

8 Jun, 2019 15:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్‌ నాయకులు 36 గంటల దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌ఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు వీహెచ్‌, జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అక్రమంగా ఎమ్మెల్యేలను చేర్చుకుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి పార్టీ వీడారనడం అబద్ధమన్నారు. పార్టీ వీడిన వారి మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా.. గవర్నర్‌ను కలిసినా సరైన స్పందన రాలేదన్నారు. కోర్టుకు వెళ్తే కేసును ఈ నెల 11కు వాయిదా వేశారని తెలిపారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని కుంతియా ప్రశ్నించారు. కేసీఆర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ప్రజాస్వామ్యానికే వెన్నుపోటుగా అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌.. దళిత ప్రతిపక్ష నేత కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ అప్రజాస్వామిక చర్యలను జనాలు చూస్తున్నారని.. ఏదో ఒక రోజు తిరగబడి తంతారని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు