పిల్లల డైపర్లూ మారుస్తామంటారు

25 Sep, 2018 01:46 IST|Sakshi
కేటీఆర్‌

ఊర్లలో హరాజ్‌ పాటలను తలపిస్తున్న ఉత్తమ్‌ హామీలు

వంట చేసి గోరు ముద్దలు తినిపిస్తామనీ చెబుతారేమో?

రైతులను కాల్చిచంపిన రాబందులొక్కటయ్యారు..

మంత్రి కె.తారకరామారావు

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోటికి ఏదొస్తే ఆ హామీ ఇస్తున్నారని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌ ప్రక టించే హామీలను అమలు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్‌ కూడా సరిపోదని అన్నారు. సోమ వారం పలువురు నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఎందుకు ఒకేసారి రుణమాఫీ చేయలేదు. ఉత్తమ్‌ హామీలు ఊర్లలో హరాజ్‌(వేలం) పాటలను తలపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే పెళ్లికాని యువకులకు అమ్మాయిలనూ చూసి పెడతామనేటట్లున్నారు. అందరి ఇళ్లలో కి వచ్చి వంట చేసి పెట్టి గోరు ముద్దలు తినిపిస్తామనీ చెబుతారేమో. పిల్లల డైపర్లూ మారుస్తామని ఉత్తమ్‌ హామీ ఇస్తారేమో’ అని ఎద్దేవా చేశారు.  

ప్రాజెక్టులు కట్టొద్దంటూ బాబు లేఖలు 
‘ఏపీ సీఎం చంద్రబాబు కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు కట్టొద్దని కేంద్రానికి 30 లేఖలు రాశారు. జయశంకర్‌ సార్‌ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. భవిష్యత్‌లో తెలంగాణ, ఏపీల మధ్య నీళ్ల వివాదాలు ఏర్పడితే చంద్రబాబు ఎవరి వైపు ఉంటారు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆఖరి వరకు అడ్డుపడి, కాళేశ్వరం ప్రాజె క్టు ఆపాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబుతో ఉత్తమ్, కోదండరాం ఎలా పొత్తు పెట్టుకుంటారు. పొరపాటున వాళ్లు అధికారంలోకి వస్తే అమరావతి బానిసలుగా ఉండాల్సిందే. మన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీఆర్‌ఎస్‌ మళ్లీ రావాలి. మోదీ, రాహుల్‌లకు భయపడే పార్టీ కాదు టీఆర్‌ఎస్‌.

మా పార్టీకి అధిష్టానం ఢిల్లీలో కాదు గల్లీలో. మహాకూటమికి ఓట్లేసి ఢిల్లీ గులాములుగా, అమరావతి బానిసలుగా ఉందామా. కాంగ్రెస్‌ నీచ, నికృష్ట పార్టీ. గతంలో ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చేసినం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియో జకవర్గాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినం. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇచ్చేందుకు పాలమూరు ప్రాజెక్టు చేపట్టాం. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీచేసిన వారు ఈ ప్రాజెక్టుపై కేసులు వేశారు. చనిపోయిన వారి పేర్లతో దొంగ వేలిముద్రలతో కేసులు వేశారు.

బషీర్‌బాగ్, ముదిగొండలో రైతులను కాల్చి చంపినోళ్లు ఒక్కటవుతున్నరు. టీడీపీ కాంగ్రెస్‌కు తోకపార్టీగా మారిపోయింది. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుం టే ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తుంది. కరెంటు కోతల పార్టీల వైపు ఉంటారా? 24 గంటలపాటు కరెంటు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న టీఆర్‌ఎస్‌ వైపు ఉంటారా తేల్చుకోండి. రైతులను కాల్చిచంపిన రాబందులొక్కటయ్యారు. రాబందుల వైపు ఉంటారా? రైతు బంధు చెక్కులిచ్చిన టీఆర్‌ఎస్‌ వైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి. నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని కేటీఆర్‌ అన్నారు. 

కోదండరాంకు ఏ అమరుడు చెప్పిండు.. 
‘కోదండరాం తెలంగాణ అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని అంటున్నారు. తెలంగాణ యువత అమరులు కావడానికి కారణమైన వారితో పొత్తులా? ఏ అమరుడు చెప్పిండని కాంగ్రెస్, టీడీపీలతో కోదండరాం పొత్తు పెట్టుకుంటున్నారు. తమను చంపిన కాంగ్రెస్, టీడీపీ వంటి నరహంతక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ఏ అమరుడు చెప్పాడు’అని మంత్రి ప్రశ్నించారు.  

అమిత్‌ షా ట్వీట్‌కు కేటీఆర్‌ రివర్స్‌ ట్వీట్‌

కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ స్వార్థంతో అందకుండా పోతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సోమవారం ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని తమ కార్యకర్తల కు పిలుపునిచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌తో అమిత్‌ షా పై ఎదురుదాడి చేశారు. ‘అమిత్‌ షా గారూ.. మిమ్మల్ని తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించారు. తెలం గాణలో మీ కార్యక్రమం కంటే చాలాకాలం నుంచి అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 80 లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. మీ ఆయుష్మాన్‌ భారత్‌తో రాష్ట్రంలో 25 లక్షల మందికి మాత్రేమే లబ్ధి చేకూరుతుంది’ అని వివరించారు. తమ విధానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు