ఆ ఏడు స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌ దూరం

17 Mar, 2019 17:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ఏడు పార్లమెంట్‌ నియోజకవర్గాలో తమ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని వెల్లడించింది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి తరఫున బరిలో నిలిచే ప్రముఖులకు వ్యతిరేకంగా తాము పోటీ చేయడం లేదని యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ ఆదివారం ప్రకటించారు. ఎస్పీ వ్యవస్థాకుడు ములాయం సింగ్‌ బరిలో నిలిచే మణిపూరి, ఆయన కోడలు బరిలో నిలిచే అవకాశం ఉన్న కానూజ్‌, అలాగే బీఎస్పీ అధినేత్రి మయావతి, ఆర్‌ఎల్‌డీ నేతలు అజిత్‌ సింగ్‌, జయంత్‌ చౌదరి బరిలో నిలిచే స్థానాలు ఉన్నాయని తెలిపారు. అలాగే అప్నాదళ్‌కు తాము రెండు సీట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. 

అఖిలేశ్‌ యాదవ్‌, మయావతి కూడా కాంగ్రెస్‌ పోటీ చేసే రెండు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదనే విషయాన్ని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబం బరిలో నిలిచే అమేథి, రాయబరేలీలో అభ్యర్థులను నిలుపకూడదని ఎస్పీ, బీఎస్పీ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్‌ 11 నుంచి మే 19 మధ్యకాలంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. 

>
మరిన్ని వార్తలు