రోజుకో హామీ అస్త్రం!

29 Sep, 2018 01:57 IST|Sakshi
శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన పార్టీ నేతలు

సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ మేనిఫెస్టో

రైతు, యువత, మహిళా సంక్షేమమే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ట్‌ హామీల అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలతో మేనిఫెస్టోను రూపొందిస్తోంది. ప్రజారంజక హామీల ద్వారా ఓటర్లను ఆకర్షిం చే యత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు ప్రధాన హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌.. రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా రోజుకో అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే వంద రోజుల్లో మెగా డీఎస్సీ, ఉద్యోగ క్యాలెండర్, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా కార్పస్‌ ఫండ్, సీపీఎస్‌ రద్దు, మహిళా సంఘాలకు రుణాలు, గ్రాంట్ల వంటి అంశాలపై ప్రకటన చేయగా తాజాగా 1969 నుంచీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఏదైనా ప్రభుత్వ పథకంతో ఆర్థికంగా ఆదుకునేలా మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. 

కౌలు రైతులకూ రైతు బంధు..! 
ఇప్పటికే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ దీన్ని ఏకకాలంలో అమలు చేస్తామని, దీనిద్వారా సుమారు 45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తోంది. అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తూనే కౌలు రైతులకూ దీన్ని విస్తరింపజేయాలని నిర్ణయించింది. మరోవైపు కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ చట్టం ప్రయోగం, భూసార పరీక్షల ఆధారంగానే పంటల సాగు, ఉద్యానవన పంటల ప్రోత్సాహకం, నియోజకవర్గానికో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి అంశాలతో మేనిఫెస్టోలో పొందుపరచాలనుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్‌ యార్డుల్లో సద్దిమూట పథకం అమలు, దళారీ వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు అంశాలను మేనిఫెస్టోలో చేర్చడాన్ని పరిశీలిస్తోంది. 

‘బంగారుతల్లి’కి మళ్లీ జీవం... 
గతంలో తాము అమలు చేసిన బంగారుతల్లి పథకాన్ని పునరుద్ధరించి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు విడతలవారీగా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మహిళలపై హత్యాచారాలు, వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ కేసులకు సంబంధించి తక్షణమే దోషులకు శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, పేద మహిళలు, ముస్లింలకు ఆర్థిక సాయంతోపాటు ఆడపిల్లలు పుడితే వారి పేరిట బ్యాంకులో డబ్బు జమ అంశాలు కమిటీ భేటీలో ప్రస్తావనకు వస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు విద్యార్థినులకు ఉచిత విద్య అంశం పరిశీలనలో ఉంది. 

నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి? 
యువతను దృష్టిలో పెట్టుకొని భారీ హామీలు గుప్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీలేని రుణాలు, నిరుద్యోగ యువతకు రూ. 3 వేల భృతి, ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు వీలుగా ఐటీఐఆర్‌ ఏర్పాటు, కేంద్ర సంస్థల్లో స్థానిక యువతకే 50 శాతం ఉపాధి అవకాశాలు వంటి అంశాలు మేనిఫెస్టో కమిటీ పరిశీలనలో ఉన్నాయి. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోతోపాటు గుజరాత్, పంజాబ్‌లలో పార్టీ తెచ్చిన మేనిఫెస్టోలను పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తుండగా దాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడం, జర్నలిస్టులకు వారి సొంత మండల, నియోజకవర్గాల్లోనే ఇళ్ల స్థలాలు, దళితులకు ఉచితంగా ఇసుక పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏటా రూ. 3 వేల కోట్ల కేటాయింపులను మేనిఫెస్టోలో చేర్చడాన్ని కమిటీ పరిశీలిస్తోంది.

ఉద్యమకారులకు గుర్తింపు: రాజనర్సింహ
తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ తెలిపారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, గుర్తించిన ఉద్యమకారులకు ప్రభుత్వపరంగా ఇళ్లు, స్థలాలు, రుణ సౌకర్యాలు, పెన్షన్లు, హెల్త్‌కార్డుల వంటి సాయం కచ్చితంగా అందే చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం దామో దరతోపాటు కమిటీ సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, కురువ విజయ్‌కుమార్, ఇంది రా శోభన్, సుధాకర్‌ యాదవ్‌లు వివిధ సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం దామోదర మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రిస్తామని, వాటిని పూర్తిగా సంస్కరించేలా చట్టాలు చేస్తామన్నారు. వైద్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. ఉపాధి హామీ సిబ్బందిని పర్మనెంట్‌ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.  

మరిన్ని వార్తలు