250 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ?

16 Jun, 2018 22:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 250 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీచేయనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌ తక్కువ స్థానాల్లో పోటీచేసి గెలుపు అవకాశాలున్న మిత్రపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లను కేటాయించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మోదీని ఓడించేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏవిధంగా పోటీచేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మాజీ కేంద్రమంత్రి  ఏకే ఆంటోని అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని పార్టీ సీనియర్‌ నేతలు వెల్లడించారు. కమిటీ అన్ని రాష్ట్రాల్లోని  సీనియర్‌ నేతలతో చర్చించి ఏ స్థానాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంశంపై ఓ నివేదికను తయారుచేస్తోందన్నారు.

 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెస్‌ కేవలం 44 స్థానాల్లోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి ఆయుపట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో విజయం సాధించాలంటే  బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టక తప్పదు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు మహాకూటమిగా  ఏర్పడాలని ఇటీవల కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే త్వరలో జరుగునున్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధించాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 250 స్థానాల్లో​ పోటీ చేస్తే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి అతి తక్కువ స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది.

>
మరిన్ని వార్తలు