మీ త్యాగం వృథాపోదు

19 Nov, 2018 01:52 IST|Sakshi
తమ నేతకు టికెట్‌ ఇవ్వకపోవడంతో గాంధీభవన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

అసంతృప్త కాంగ్రెస్‌ నేతలతో నారాయణస్వామి, మల్లాడి, శివకుమార్‌ భేటీ

హాజరైన 20 మందికి పైగా నేతలు

బరిలో కచ్చితంగా ఉంటామన్న నాయిని, మల్‌రెడ్డి

నేడూ హైదరాబాద్‌లోనే అధిష్టానం దూతలు

భవిష్యత్తులో న్యాయం చేస్తాం

సాక్షి, హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం పంపిన ముగ్గురు దూతలు అసంతృప్త నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి, ఆ రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ దాదాపు 20 మందికి పైగా నేతలతో సమావేశమై వారి భవిష్యత్‌పై హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

ఇందులో పొంగులేటి సుధాకర్‌రెడ్డి (ఖమ్మం), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), నాయి ని రాజేందర్‌రెడ్డి (వరంగల్‌ పశ్చిమ), సంగిశెట్టి జగదీశ్‌ (ముషీరాబాద్‌), తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌), కార్తీక్‌రెడ్డి (రాజేంద్రనగర్‌), నేరెళ్ల శారద (కరీంనగర్‌), పాల్వాయి స్రవంతి (మునుగోడు), గజ్జెల కాంతం (చొప్పదండి), దుర్గం భాస్కర్‌ (బెల్లంపల్లి), దరువు ఎల్లన్న (ధర్మపురి), విజయరామరాజు (కంటోన్మెంట్‌) ఉన్నారు. అసంతృప్తులతో మాట్లాడిన నేతలు భవిష్యత్‌లో తప్పకుండా న్యాయం చేస్తామని, పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తున్నందున త్యాగం చేయక తప్పదని చెప్పినట్టు తెలుస్తోంది.

దూతలతో సమావేశం అయిన తర్వాత మల్‌రెడ్డి రంగారెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి మాత్రం తాము కచ్చితంగా ఎన్నికల బరిలో ఉండి తీరుతామని, పార్టీ అధిష్టానం బీ ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుజ్జగింపుల కమిటీని పొన్నాల లక్ష్మయ్య, రేగులపాటి రమ్యారావు, వీహెచ్, మధుయాష్కీ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితోపాటు దుబ్బాక టీజేఎస్‌ అభ్యర్థి చిందం రాజ్‌కుమార్, అక్కడి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న మద్దుల నాగేశ్వర్‌రెడ్డితో కూడా అధిష్టాన దూతలు చర్చించారు. అధిష్టానం నుంచి బుజ్జగింపుల కోసం వచ్చిన దూతలు సోమవారం కూడా నగ రంలోనే ఉండి మరికొందరు అసంతృప్తులతో సమావేశం కానున్నారు. బండ్ల గణేశ్, కాసాని జ్ఞానేశ్వర్, బండ కార్తీకరెడ్డి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నివాసానికి వెళ్లి తమకు పోటీచేసే అవకాశం కల్పించాలని కోరారు.  


భేటీ తర్వాత ఎవరేమన్నారంటే..
నా తండ్రి పాల్వాయి గోవర్ధనరెడ్డి 60 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేశారు. చివరివరకు మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉన్నారు. నేను 20 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నా. ఇప్పుడు కార్యకర్తలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. భవిష్యత్‌ బాగుంటుందని దూతలు చెప్పారు. రాహుల్‌గాంధీ కూడా వ్యక్తిగతంగా చెప్పారు.    – పాల్వాయి స్రవంతి (మునుగోడు)

‘గత ఎన్నికల అనుభవాలను దూతలకు చెప్పా. పొత్తుల పేరుతో సిట్టింగ్‌ సీట్లు ఇవ్వకపోవడాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా. నాకు సీటు వచ్చినా రాకపోయినా పార్టీ కోసం కష్టపడతా.’
–పొంగులేటి సుధాకర్‌రెడ్డి (ఖమ్మం)

‘యాదవులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదో చెప్పాలని దూతలను అడిగాను. ఎంపీగా పోటీచేసే వారికి ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించా. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే అన్ని సామాజిక వర్గాలను కలుపు కొనిపోవాలి. యాదవులను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? రాహుల్‌గాంధీ, సోనియా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరా. నేడు నామినేషన్‌ వేస్తా. సోనియాగాంధీ సభ కంటే ముందే నా విషయంలో క్లారిటీ వస్తుంది.’ – తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌) 

మరిన్ని వార్తలు