కాళేశ్వరం డీపీఆర్‌ ఏమైంది?

15 Jun, 2019 05:26 IST|Sakshi

కమీషన్‌ల కోసమే జాతీయ హోదా కోసం పోరాడలేదు

ప్రభుత్వ వైఖరిపై సీఎల్పీ నేత భట్టి విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం పేరు మీద కార్పొరేషన్‌ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఏమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల ముందు డీపీఆర్‌ను ఎందుకు పెట్టలేదని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అంబేడ్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో గతంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని గుర్తుచేశారు.

అదే ప్రాజెక్టును కేసీఆర్‌ రీడిజైన్‌ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ హాల్‌లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జాతీయ హోదా కోసం పోరాడితే 95 శాతం నిధులు కేంద్రమే ఇచ్చేదని, కానీ కమీషన్ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందుకు పోరాడలేదని ఆరోపించారు. రీడిజైన్‌ పేరుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు.

దీనికి ఏటా రూ.5 వేల కోట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టు టెండర్లన్నీ ఇరిగేషన్‌ వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు ప్రారంభానికి రాష్ట్ర నేతలను పిలవకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తున్నారని, ఇదెక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా పార్టీ అవసరాలకు ఆర్థిక వనరులు సమకూర్చే వనరుగా మార్చారని, అభివృద్ధి కోసం మండిపడ్డారు. పార్టీకి, డబ్బులు కావాల్సినప్పుడల్లా కాళేశ్వరాన్ని కామధేనువులా వాడుకుంటున్నారని ఆరోపిం చారు.

ఈ ప్రాజెక్టులో అవినీతి చిట్టా బయటపెడతారన్న భయంతోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటలు రాజ్యాంగాన్ని కాపాడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం దుస్సంప్రదాయమని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా చేవెళ్లకు నీళ్లు రావాలని గతంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాదయాత్ర చేశారని, ఈ ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీటి వాటా ఇస్తామని టీఆర్‌ఎస్‌ వాళ్లు చెప్పారా అని ఆమెను భట్టి ప్రశ్నించారు. నీళ్లివ్వనప్పుడు టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు