‘అందుకే గాంధీ భవన్‌కు ఉత్తమ్‌ రానన్నారు’

7 Jan, 2019 15:43 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఎన్నికల ముందు కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యం నింపేందుకే  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే గాంధీభవన్ రానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సవాల్‌ చేశారని, ఇలాంటివి రాజకీయాల్లో సాధారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీలో స్వెచ్ఛ ఎక్కువగా ఉంటుందని, ఎవరైనా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుందన్నారు. సర్వే సత్యనారాయణ వ్యవహారం పార్టీ అంతర్గతమైన విషయమని చెప్పారు.

పొత్తులపై జాతీయ స్థాయిలో నిర్ణయం జరిగిందని, టీడీపీతో పొత్తు కూడా అందులో భాగమేనన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ గెలుపుకు దోహదపడ్డాయని చెప్పారు. ఎలక్షన్‌ కమిషన్‌ కూడా టీఆర్‌ఎస్‌ గెలుపుకు సహకరించిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పుణ్యమానని ఎమ్మెల్యేగా గెలవాలంటే రూ.25 నుంచి రూ.30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. తనపై ప్రజలకు ఉన్న అభిమానమే ఈ ఎన్నికల్లో గెలిపిందన్నారు.మెదక్‌ ఎంపీ టికెట్‌ తన భార్య నిర్మలకు ఇస్తే పోటీ చేసి గెలిపిస్తానన్నారు. అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు.

నిన్న(ఆదివారం) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప స్వామి భక్తుల కుటుంబాలకి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున కూడా వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు