సీనియర్లకు చోటేది.. భగ్గుమన్న అసంతృప్తులు!

3 Jan, 2020 08:25 IST|Sakshi

సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వకపోవడమేంటి?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణతి అనుచరుల ఆందోళన

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ అసంతృప్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో మంత్రలుగా అవకాశం లభిస్తుందనుకున్న పలువురు సీనియర్లకు మొండిచేయి ఎదురైంది. మంత్రివర్గ విస్తరణ జరిగి నాలుగు రోజులైన తరువాత అసంతృప్తుల ఒక్కొకరూ బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రణతీ షిండేకు స్థానం కల్పించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె మద్దతుదారుల గురువారం షోలాపూర్‌ కాంగ్రెస్‌ భవనం ఎదుట ధర్నా, ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, వివిధ రీజియన్‌లకు చెందిన పదాధికారులు పాల్గొన్నారు. (కీలక భేటీకి సీనియర్‌ నేత డుమ్మా.. కారణం అదేనా!)

సీనియర్ నేత సుశీల్‌ కుమార్‌ షిండే కుమార్తె ప్రణతీ షిండే షోలాపూర్‌ సిటీ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. దీంతో కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమని ఆమె భావించారు. ఈ మేరకు మద్దతుదారులకూ భరోసా ఇచ్చారు. మహా వికాస్‌ ఆఘాడి మంత్రి వర్గ విస్తరణలో తనను చిన్న చూపు చూశారని, ఇప్పటికైనా నాయకులు మనసు మార్చుకుని స్థానం కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కొత్తగా ఎన్నికైన వారికి పదవులు కట్టబెట్టారని,  సీనియర్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రణతీకి మంత్రివర్గంలో స్థానం కల్పించని పక్షంలో మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ మల్లిఖార్జున్‌ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేస్తామని ఆమె మద్దతుదారులు హెచ్చరించారు. కాగా ప్రణతీతో పాటు మరికొందరు నేతలు కూడా మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ జాబితా శివసేన ఎంపీ  సంజయ్‌ రౌత్‌ సోదరుడు సేన ఎమ్మెల్యే సునీల్‌ రౌత్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో రౌత్‌ కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. కేబినెట్‌ విస్తరణ సందర్భంగా విధానభవన్‌లో నిర్వహించిన మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంజయ్‌ హాజరుకాలేదు. మంత్రివర్గ విస్తరణకు ముందు మూడు పార్టీల నేతల మధ్య జరిగిన కీలక భేటీకి కూడా రౌత్‌ గైర్హాజరు అయ్యారు. ఈ విషయం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన శాసన సభ్యుడిగా ఉన్న రౌత్‌ సోదరుడు సునీల్‌ రౌత్‌కు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడం అని సమాచారం. సునీల్‌కు మంత్రిపదవి కోసం సంజయ్‌ తొలి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అతడికి చోటు దక్కలేదు. దీంతో రౌత్‌ తీవ్ర అసంతృప్తికి గురియ్యారని సమాచారం. అయితే ఈ వార్తలను రౌట్‌ కొట్టిపారేశారు.  కాగా డిసెంబర్‌ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 36 మందిని ఉద్ధవ్‌ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు.

మరిన్ని వార్తలు