సీఎం.. ఏ ప్రాంతానికి?: రాజగోపాల్‌రెడ్డి

8 Mar, 2020 03:22 IST|Sakshi

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: ఎర్రబెల్లి

అసెంబ్లీలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్యుద్ధం

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో శనివారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరి గింది. ఒకదశలో సహనం కోల్పోయిన ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో సవాలు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరంపై ఉన్న శ్రద్ద పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై లేదని, ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రా లేదా ఓ ప్రాంతానికా అనేది అర్థం కావడం లేదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని రాజగోపాల్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత అసహనానికి లోనైన రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ద్రోహులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎదురుదాడికి దిగారు. సీఎం కేసీఆర్‌ దర్శన భాగ్యం దొరకడం లేదని, మంత్రులు ఎవరెక్కడ ఉన్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీంతో ఎర్రబెల్లి.. ఇలాగే మాట్లాడితే పరుగెత్తించి కొడతారంటూ రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. గడచిన 13 నెలల నుంచి సీఎం దర్శనం దొరకడంలేదని రాజగోపాల్‌రెడ్డివిమర్శించారు.

వందమంది కౌరవులకు ఐదుగురు చాలు
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ– ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. శాసనసభలో వందమంది ఉన్నారని టీఆర్‌ఎస్‌ విర్రవీగుతోంది. వందమంది కౌరవులను ఐదుగురు పాండవులు ఏం చేశారో గుర్తుంచుకోవాలి. డబ్బుతో రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వం కార్పొరేట్‌ ఆస్పత్రులకు దాసోహమవుతూ.. ప్రభుత్వాస్పత్రులను నిర్వీర్యం చేస్తోంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఎర్రవెల్లి, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో నిర్మిస్తే సరిపోతుందా?. ఇంటింటికీ నల్లానీరు రాకపోతే ఓట్లడగనని ఎన్నికల్లో హామీనిచ్చారు. ఆరేళ్లయినా నల్లా నీళ్లు రాలేదు. నా నియోజకవర్గంలో 14 నెలలైనా క్యాంపు ఆఫీసు నిర్మించలేదు. ఏ పనికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు దోచిపెట్టేందుకే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోంది’అని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు