రాజ్‌గోపాల్‌ రెడ్డి యూటర్న్‌.. బీజేపీకి నో!

13 Jul, 2019 20:17 IST|Sakshi

కాంగ్రెస్‌ నాకు జన్మనిచ్చిన పార్టీ

పార్టీ బాగు కోసమే ఆ వ్యాఖ్యలు చేశాను

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: రాజ్‌గోపాల్‌ రెడ్డి

సాక్షి, నల్గొండ: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ రాజ్‌గోపాల్‌.. బీజేపీ చేరుతున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. ఫిరాయింపునకు సిద్ధమయ్యారని తెలిసిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీపై ఆయనపై చర్యలు కూడా తీసుకుంది. అయితే గడిచిన నెల రోజులు మౌనంగా ఉన్న రాజ్‌గోపాల్‌ రెడ్డి.. హఠాత్తుగా మాటమార్చారు. శనివారం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ అని వ్యాఖ్యానించారు. పార్టీ బాగుకోసమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, అధిష్టానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలంటే కుంతియా, ఉత్తమ్‌ కుమార్‌లు సరిపోరని మాత్రమే తాను అన్నట్లు చెప్పారు. దానిని తప్పుగా అర్థం చేసుకున్న పార్టీ నేతలు.. షోకాజు నోటీసులు ఇచ్చారని వివరించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎంను అంటూ.. చెప్పుకున్నారు కూడా. అంతేకాదు టీకాంగ్రెస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని దాదాపు అందరూ భావించారు. కాగా కోమటిరెడ్డి తాజా యూటర్న్‌ కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ మారడంపై ఇప్పటి వరకూ స్పష్టతన్విలేదు.


 

మరిన్ని వార్తలు