ఖైదీలకు క్షమాభిక్ష పెట్టండి

17 Jan, 2018 02:05 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏళ్లకు ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి.. విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న ఖైదీల‌ను విడుద‌ల చేయ‌డానికి అవ‌స‌ర‌మైన జీవోను విడుద‌ల చేయాలని కోరారు. గ‌తంలో పెట్టిన ష‌ర‌తులు కాల‌ప‌రిమితుల‌తో లేకుండా ఉద్యమ స‌మ‌యంలో ఖైదీల‌కు మీరు హామీ మేరకు.. ఐదేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలకు.. ఏడేళ్లు వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిష‌న్ శిక్షతో క‌లిపి ప‌దేళ్ల శిక్షను పూర్తిచేసిన పురుష ఖైదీలంద‌రినీ విడుద‌ల చేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రాసిన లేఖ పూర్తి సారాంశం ఇది..

రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వకుంట్ల చంద్రశేఖ‌ర్ రావు గారికి..
ప్రాయ‌శ్చిత్తానికి మించిన శిక్షలేదని మ‌న వేదాలు, ధ‌ర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే యావ‌జ్జీవ‌ కారాగార శిక్ష ప‌డిన ఖైదీకైనా ఐదేళ్లు శిక్ష విధిస్తే స‌రిపోతుంద‌ని మ‌హాత్మా గాంధీ కూడా చెప్పడం జ‌రిగింది. వారు మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలోనూ, గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగానూ ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన వారిని విడుద‌ల చేస్తామ‌ని మీరు కూడా ప‌లు సంద‌ర్భాల‌లో హామీ ఇవ్వడం జ‌రిగింది. రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా ఖైదీల‌కు ఇచ్చిన హామీని మీరు నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో అటు ఖైదీలు, ఇటు వారి రాక‌కోసం ఎదురుచూస్తున్న కుటుంబీకులు కూడా మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తున్నారు. ఆవేశంలోనో, ఆగ్రహంతోనో త‌ప్పు చేసి, కొన్ని సంద‌ర్భాల్లో తాము త‌ప్పు చేయ‌క‌పోయినా త‌ప్పు చేసిన వారికి బంధువులో, స్నేహితులో అయిన పాపానికి నాలుగు గోడ‌ల మ‌ధ్య  న‌లిగిపోయే వారు అనుక్షణం మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తూనే ఉంటారు. వారిపై ఆధార‌ప‌డిన కుటుంబీకులు అంత‌కుమించిన మాన‌సిక శిక్షను అనుభ‌విస్తుంటారు.

జీవితం విలువ తెలియాలంటే యావ‌జ్జీవ శిక్ష ప‌డిన ఖైదీల‌ను అడిగి తెలుసుకోవాల‌ని కూడాగాంధీ గారు చెప్పడం జ‌రిగింది. అందుకే వారికి మేలు చేసే మాట ఎవ‌రిచ్చినా అది ఎప్పుడు నిజ‌మౌతుందా అని క‌ళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంట‌నే ఐదేళ్ల శిక్షా కాలం పూర్తి చేసుకున్న ఖైదీల‌ంద‌రినీ విడుద‌ల చేస్తామ‌ని హామీ ఇచ్చిన మీరు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి ప్రసాదించిన క్షమాభిక్ష వంద‌లమంది ఖైదీల‌ను నిరాశ ప‌రిచింది. మీరు గ‌తంలో ఇచ్చిన మాట‌కు భిన్నంగా ఐదేళ్లు శిక్ష పూర్తి చేసిన వారిని కాకుండా 12 నుంచి 14 సంవ‌త్సరాల వాస్తవ శిక్ష‌, క‌నీసం ఆరేళ్ల  రిమిష‌న్ శిక్షతో క‌లిపి కనీసం 18 నుంచి 20 సంవ‌త్సరాల శిక్షా కాలాన్ని పూర్తి చేసిన వారికి మాత్రేమే క్షమాభిక్ష పెట్టి విడుద‌ల చేయ‌డం జ‌రిగింది.

ఈ కాల‌ప‌రిమితి కార‌ణంగా  వంద‌లాది ఖైదీలు విడుద‌ల‌కు నోచుకోలేదు. దీంతో శిక్ష అనుభ‌విస్తున్న త‌మ వారు విడుద‌ల‌వుతార‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్న వంద‌లాది కుటుంబాల‌కు నిరాశే మిగిలింది. ఆ త‌ర్వాత మ‌రో సంద‌ర్భంలోనైనా మీరు మీ మాట‌ను నిల‌బెట్టుకుంటార‌ని ఖైదీలు, వారి కుటుంబీకులు ఆశ‌గా ఎదురుచూస్తున్నా ఫ‌లితం లేకుండా పోతోంది. ఎన్నో గాంధీ జ‌యంతులు, రిప‌బ్లిక్ డేలు వెళ్లిపోతున్నా మీరు మాత్రం ఖైదీల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేదు. ఇది చాలా దారుణం, అమాన‌వీయం కూడా.

ఈ నేప‌థ్యంలోనే రాబోయే రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న ఖైదీల‌ను విడుద‌ల చేయ‌డానికి అవ‌స‌ర‌మైన జీవోను విడుద‌ల చేయాల్సిన బాధ్యత మీ మీద‌నే ఉన్నది. అయితే గ‌తంలో పెట్టిన ష‌ర‌తులు కాల‌ప‌రిమితుల‌తో కాకుండా ఉద్యమ స‌మ‌యంలో ఖైదీల‌కు మీరు హామీ మేరకు.. మ‌హిళా ఖైదీల్లో ఐదేళ్లు శిక్షను పూర్తిచేసిన వారిని, అలాగే పురుష ఖైదీల‌లో ఏడేళ్లు వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిష‌న్ శిక్షతో క‌లిపి ప‌దేళ్ల శిక్షను పూర్తిచేసిన వారంద‌రినీ విడుద‌ల చేయ‌డానికి జీవోను జారీ చేయాల్సిందిగా కోరుతున్నాను.

గ‌తంలో జీవోలు132 (తేదీ25.09.1969), 1040 (తేదీ 04.08.1972), 413 (తేదీ 03.04.1975), 357 (తేదీ 20.10.1980), 580 (తేదీ 20.10.1984) ద్వారా 1969, 1972, 1975, 1980, 1983, 1984 సంవ‌త్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు ఐదేళ్లు శిక్ష ప‌డిన ఖైదీల‌ను విడుద‌ల చేశాయి. అలాగే జీవోలు 4 (తేదీ 17.01.1995), 195 (08.07.1995), 193 (తేదీ 11.08.1997), 18  (తేదీ 25.01.2000), 196 (తేదీ 13.08.2004), 415 (తేదీ 01.10.2009),  28 (తేదీ 25.01.2011), 220 (తేదీ 28.09.2013)  ద్వారా 1995, 1997, 2000, 2004, 2009, 2011, 2013 సంవ‌త్సరాల్లో ఏడు సంవత్సరాల వాస్తవ శిక్ష‌, 3 సంవ‌త్సరాల రిమిష‌న్‌తో క‌లిపి ప‌దేళ్లు పూర్తయిన ఖైదీలంద‌రినీ విడుద‌ల చేశారు. ఈ విష‌యాన్ని మీరు గ‌మ‌నించాల్సిందిగా కోరుతూ ఈ రిప‌బ్లిక్ దినోత్సవం సంద‌ర్భంగానైనా ఖైదీల‌కు క్షమాభిక్షను పెట్టి స్వేచ్ఛావాయువుల‌ను ప్రసాదించాల‌ని త‌మ‌రిని కోరుతున్నాను.
  -రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు