టీఆర్‌ఎస్‌లోకి సీతక్క?

7 Jun, 2019 05:32 IST|Sakshi

ములుగు ఎమ్మెల్యే చేరికపై రెండు రోజులుగా ప్రచారం

కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే

ములుగు: కాంగ్రెస్‌ తరఫున ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన ధనసరి అనసూయ(సీతక్క) టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఈ విషయం రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు గురువారం ఓ ప్రధాన టీవీ ఛానల్‌లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు సీతక్క సైతం కారు ఎక్కనున్నట్లు స్క్రోలింగ్‌ రావడంతో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు హన్మకొండలోని సీతక్క నివాసానికి వెళ్లారు. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంతోనే ఆమె టీఆర్‌ఎస్‌ చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకత్వం స్పష్టం చేసింది.

పార్టీలో చేరగానే పదవి.. ఆపై ఎమ్మెల్యే
టీడీపీలో ఉన్న సీతక్క గత అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆమెకు ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం తో పాటు ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పొదెం వీరయ్యను కాదని ఆమెకు అసెంబ్లీ టికెట్‌ కూడా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సీతక్క భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినా సీతక్క మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతుండడంతో సీతక్క మరో వారం రోజుల్లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.  

అదంతా తప్పుడు ప్రచారమే..
కొంతమంది నాయకులు గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరాలని కోరినా తాను వెళ్లలేదని సీతక్క స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ టీఆర్‌ఎస్‌ నాయకులు ఇదే విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో నిజం లేదని, కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు