ఆర్టీసీని మూసేస్తాననడం సరైంది కాదు

8 Jun, 2018 18:05 IST|Sakshi
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులను భయపెట్టాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నాడని, ఆర్టీసీని మూసేస్తానని సీఎం చెప్పడం సరైనది కాదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. దాదాపు 50 వేలకు పైగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించడం దారుణమన్నారు. ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్‌ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ఆర్టీసీ అధికారుల వల్ల ఆర్టీసీ నష్టల్లో లేదని, ప్రభుత్వ విధానాల వల్లే నష్టాల్లో కూరుకుపోయిందని విమర్శించారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కానీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృసి చేయడం లేదని మండిపడ్డారు. డ్రైవర్‌, కండక్టర్‌ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని మండిపడ్డారు.  సీఎం కేసీఆర్‌ కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని హితవు పలికారు. ప్రైవేటు బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంత రావు మాట్లాడుతూ..​‍‘ ఉద్యోగాలు తీసేస్తామని కేసీఆర్‌, ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓట్ల కోసం అడగకపోయినా కుల సంఘాలకు రూ.5 కోట్లు, 5 ఎకరాలు కేటాయిస్తున్నారు. న్యాయంగా రావాల్సిన జీతాలు అడిగితే ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్‌ భయపెడుతున్నారు.  రోడ్లపైన కూడా ప్రజలకు అన్యాయంగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగే పనులను ప్రభుత్వం మానుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పీసీసీ ఆలోచిస్తుంది. ఈ నెల 11న రాహుల్‌ గాంధీ సమక్షంలో జాతీయ ఓబీసీ కమిటీ మీటింగ్‌ ఉంది. 2019 ఎన్నికల్లో కలసి ఉంటే కలదు సుఖం అనే నినాదంలో కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుంద’ని అన్నారు.

మరిన్ని వార్తలు